Pete Hegseth: యుద్ధానికి ముందే రక్షణ రంగంలో భారీ పెట్టుబడులు.. పీట్ హెగ్సెత్ పై సంచలన అనుమానాలు!
పీట్ హెగ్సెత్ పై సంచలన అనుమానాలు!
Pete Hegseth: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth)కు సంబంధించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలు ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు హెగ్సెత్ బ్రోకర్ ఒకరు అమెరికా రక్షణ రంగ సంస్థల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలను ఉదహరించి ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది.
మార్గాన్ స్టాన్లీతో కలిసి పని చేస్తున్న ఆ బ్రోకర్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో బ్లాక్‌రాక్‌ను సంప్రదించి, దాని ‘డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈటీఎఫ్’ల్లో మిలియన్ డాలర్ల పెట్టుబడి వేయాలని ఆరా తీసినట్లు సమాచారం. అంతర్గతంగా చర్చలు కూడా జరిగాయని వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఆ సమయంలో ఆ ఈటీఎఫ్‌లు మార్గాన్ స్టాన్లీ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో లేకపోవడంతో పెట్టుబడి ప్రక్రియ ముందుకు సాగలేదు. తర్వాత హెగ్సెత్ బ్రోకర్ మరే ఇతర రక్షణ రంగ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు.
ఈ పరిణామాలు యుద్ధానికి కొన్ని వారాల ముందు జరగడంతో పీట్ హెగ్సెత్ తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇటీవల ‘పీట్ చెప్పడం వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి దిగామని’ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడుల వార్తలపై రక్షణ మంత్రి లేదా పెంటాగాన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వెలువడలేదు.
బ్లాక్‌రాక్ ‘డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈక్విటీ ఫండ్’ విలువ 3.2 బిలియన్ డాలర్లు. రక్షణ, భద్రతపై ప్రభుత్వం ఖర్చు పెంచడం వల్ల లాభపడే ఏరోస్పేస్, సెక్యూరిటీ టెక్నాలజీ, డిఫెన్స్ కాంట్రాక్టింగ్ వంటి రంగాల కంపెనీల స్టాక్‌లను ఈ ఫండ్ నిర్వహిస్తుంది. ఆర్టీఎక్స్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ రక్షణ సంస్థలు దీనితో ముడిపడి ఉన్నాయి. తక్కువ ఫీజులు, పన్ను ప్రయోజనాలు వంటి కారణాలతో ఈ ఈటీఎఫ్‌లకు మదుపరుల నుంచి మంచి స్పందన వస్తోంది.