PM Modi: ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను కాపాడిన ఫ్లైదుబాయ్ పైలట్, భారతీయుడు కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆయన్ను కొనియాడారు. యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, 9/11 తరహా మారణహోమాన్ని ఒక భారతీయుడు నివారించాడని అభినందించారు.

‘‘నిన్న జరిగిన ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ సహనం, సమయస్ఫూర్తి, ధైర్యంతో స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని చెప్పినట్టుగా.. ఒక భారతీయుడు 9/11 తరహా మారణహోమాన్ని నివారించారు. ఆయన మన దేశ గౌరవాన్ని పెంచారు’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థలో చేరకముందు స్మిత్ మచ్చర్ స్పైస్‌జెట్‌లో 10 ఏళ్లపాటు విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ స్పందిస్తూ, ‘‘ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఎన్నో ప్రాణాలను కాపాడాయి. ఆయన ధైర్యం, నిస్వార్థ సేవ.. స్పైస్‌జెట్‌లో మేము అమూల్యంగా భావించే విలువలకు నిజమైన ప్రతిరూపం. ఆయన త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం. కెప్టెన్‌.. మీరు మా అందరికీ హీరో’’ అని కొనియాడింది.

ఈ ధైర్యసాహసాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ భారత దేశ గౌరవాన్ని పెంచిన హీరోగా నిలిచారు.

Tags: