PM Modi’s Indonesia Visit: ప్రధాని మోదీ ఇండోనేసియా పర్యటన: బ్రహ్మోస్ క్షిపణులు సహా 14 కీలక ఒప్పందాలు
14 కీలక ఒప్పందాలు
PM Modi’s Indonesia Visit: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా పర్యటనలో అత్యాధునిక ‘బ్రహ్మోస్’ సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణులు, ‘అస్త్ర’ క్షిపణుల విక్రయం సహా రెండు దేశాల మధ్య 14 ముఖ్యమైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల విలువ సుమారు రూ.5,600 కోట్లు. ఆపరేషన్ సిందూర్‌లో ఈ క్షిపణులు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. నౌకాయాన భద్రత, కీలక ఖనిజాల సరఫరా, ఔషధాలు, విద్య, అంతరిక్షం, టెలికమ్యూనికేషన్స్, ఆహార భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. స్టెయిన్‌లెస్ స్టీల్, నికెల్, అరుదైన ఖనిజాలతో అయస్కాంతాల తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి భారత్ సన్నద్ధమైంది. విద్యుత్ వాహనాలు, గాలి మరలు, స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఇవి ఉపయోగపడతాయి.
కలిసి ఉత్పత్తి, నౌకల నిర్మాణం, నిర్వహణ సదుపాయాలపై చర్చించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన సబాంగ్ ఓడరేవును ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత్ యూపీఐని అనుసంధానం చేయడానికి అంగీకృతం. ఐఐఎం-బెంగళూరు క్యాంపస్‌ను ఇండోనేసియాలో ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. ఇండోనేసియాకు ఈవీఎంలను ఎగుమతి చేయడానికి కూడా ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింతాంగ్ ఆదిపుర్ణా’ (స్టార్ ఆఫ్ ఇండోనేసియా)ను అధ్యక్షుడు సుబియాంతో మోదీకి అందజేశారు. ఇది భారతీయులందరికీ గౌరవమని, దానిని వారికే అంకితం చేస్తున్నానని మోదీ తెలిపారు.
జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అనేదే తమ మంత్రమని, దాని ఆధారంగా భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. సుబియాంతో మాట్లాడుతూ తనలోనూ భారత డీఎన్‌ఏ ఉందని, భారతీయ సంగీతం విన్నప్పుడు పులకిస్తానని చెప్పారు. మోదీని ఆరాధిస్తానని, ఆయన విధానాలను కాపీ చేస్తున్నానని సుబియాంతో ప్రకటించగా, స్నేహితుల మధ్య కాపీరైట్ ఉండదని మోదీ నవ్వుతూ స్పందించారు.
ఇండోనేసియా స్వాతంత్ర్య సమరంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాత్రను, ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్ సహాయాన్ని మోదీ కొనియాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత విస్తరించాలని, 140 కోట్ల భారతీయులు, 29 కోట్ల ఇండోనేసియా ప్రజలు కలిసి ప్రపంచానికి కొత్త సుసంపన్నతను సృష్టిస్తారని మోదీ ఇండోనేసియా పార్లమెంటులో ప్రసంగించారు. సముద్రం వారధిలా ఉండగా, రామాయణం, మహాభారతం, నలందా విజ్ఞాన సంపద ఇరు దేశాల బంధానికి పునాది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పర్యటన భారత్-ఇండోనేసియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు ఇవ్వనుంది.