Earthquakes Rock Venezuela: దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాను నిమిషాల వ్యవధిలో రెండు శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. భూప్రకంపనల తీవ్రతకు రాజధాని కరాకస్‌లోని బహుళ అంతస్తు భవనాలు ఊగిపోయి, కొన్ని కూలిపోయాయి. ఈ అకస్మాత్తు విపత్తుతో ప్రజలు భయాందోళనకు గురై, సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు.

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, తొలి భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో నమోదు కాగా, రెండవది మరింత భయంకరంగా 7.5 తీవ్రతను చూపించింది. మొదటి భూకంపం కేంద్రం దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమంగా సుమారు 28 కి.మీ. దూరంలో, 13 కి.మీ. లోతులో ఏర్పడింది. ఈ ప్రకంపనల ధాటికి కరాకస్‌లో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. పలువురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

భూకంపం ప్రభావంతో ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

జపాన్‌లో కూడా భూకంపం

వెనెజువెలా భూకంపం తర్వాత జపాన్‌ను కూడా 6.9 తీవ్రతతో భూకంపం వణికించింది. హొన్షు ఐలాండ్‌లోని ఐవాటె ప్రిఫెక్చర్ సమీపంలో 50 కి.మీ. లోతులో భూకంప కేంద్రం నమోదైంది. వందల కి.మీ. వరకు ప్రకంపనలు అనుభవించారు. షింకాసెన్ బుల్లెట్ ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, జపాన్‌లో సునామీ హెచ్చరిక జారీ కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పునరావృతమవుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: