President Donald Trump: రానున్న 24 గంటల్లో ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు.. యుద్ధం తీవ్ర స్థాయికి!

యుద్ధం తీవ్ర స్థాయికి!

Update: 2026-03-03 07:24 GMT

President Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరింత శక్తివంతమైన దాడులకు సిద్ధమవుతోంది. రానున్న 24 గంటల్లో భీకరమైన సైనిక చర్యలు చేపట్టనున్నట్లు అమెరికా అధికారులు సూచించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై 'భారీ దాడులు' జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, "ఇప్పటివరకు ఇరాన్‌పై మేం పెద్ద దాడులు చేయలేదు. త్వరలోనే భీకరమైన చర్యలు తీసుకుంటాం. ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం. ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం మాది. దాన్ని పూర్తిగా ఉపయోగిస్తాం" అని పేర్కొన్నారు. యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాను కోరుకోవడం లేదని, అనుకున్న లక్ష్యాలను త్వరగా సాధిస్తామని ఆయన వెల్లడించారు.

ఇరాన్ అరబ్ దేశాలపై దాడులకు దిగడం ఆశ్చర్యకరమని ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో తీవ్ర స్థాయిలో పోరాడాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇరాన్ నాయకత్వం ఎవరు తీసుకుంటారో తెలియదని, తొలి దాడుల్లోనే కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. యురేనియం శుద్ధీకరణను ఆపేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని, సైనిక చర్యలే ఏకైక మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్ పౌరులు వెంటనే ఆ ప్రాంతాలను వదిలి వెళ్లాలని సూచించింది. భద్రతా కారణాలతో అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని తరలిపోవాలని తెలిపింది.

ప్రస్తుతం 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ నుంచి ప్రతిదాడులు, డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడం, రియాద్‌లో అమెరికా ఎంబసీపై దాడులు జరగడం వంటి పరిణామాలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ప్రపంచ దేశాలు ఈ యుద్ధ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News