PTI : పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్ అరెస్టు అయి మూడేళ్లు పూర్తవుతోంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాక్ వ్యాప్తంగా మళ్లీ నిరసనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా అరెస్టయ్యారు.

పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ నిరసనలు ప్రధానంగా ప్రారంభమయ్యాయి. లాహోర్, రావల్పిండి, కరాచీ సహా పలు నగరాల్లో ఇమ్రాన్ మద్దతుదారులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయువును ప్రయోగించారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, పీటీఐ నేత ముహమ్మద్ సోహైల్ అఫ్రిదీ పాక్ ప్రభుత్వానికి సెప్టెంబర్ 27ను డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఇమ్రాన్, ఆయన భార్యపై పెట్టిన కేసుల్లో న్యాయపరమైన విచారణ జరగాలని, తన న్యాయవాదులను, వైద్య సిబ్బందిని మాజీ ప్రధాని కలుసుకునేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పెషావర్‌లో పార్టీ మద్దతుదారులతో మాట్లాడుతూ ఆయన హెచ్చరించారు: “ఇమ్రాన్‌కు న్యాయం దక్కకపోతే సెప్టెంబర్ 27న పాక్ ప్రజలు ఇస్లామాబాద్‌కు మార్చ్‌గా వస్తారు.”

జైలులో ఉన్న ఇమ్రాన్‌కు సరైన వైద్య సహాయం అందడం లేదని, చూపు మందగించిందని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఇమ్రాన్‌కు న్యాయమైన విచారణ హక్కును తిరస్కరించారని, సుదీర్ఘకాలం పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచారని మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఆరోపించింది.

Tags: