Putin’s Big Offer to India: పుతిన్ బిగ్ ఆఫర్: Su-57 యుద్ధ విమానాలను భారత్‌తో కలిసి తయారు చేద్దాం!

భారత్‌తో కలిసి తయారు చేద్దాం!

Update: 2026-06-05 06:58 GMT

Putin’s Big Offer to India: భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఐదో తరం అధునాతన యుద్ధ విమానాలను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ముఖ్యమైన ప్రతిపాదన వచ్చింది. సుఖోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్లను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. కీలక సాంకేతిక విజ్ఞానాన్ని కూడా పంచుకోవడానికి రష్యా ముందుకు వచ్చింది.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ముఖ్యమైన ఆఫర్‌ను పుతిన్ వెల్లడించారు.

రక్షణ రంగంలో భారత్-రష్యా సహకారం ఎప్పటికీ అపరిమితం

ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఐదో తరం యుద్ధ విమానాలు లేవు. ఈ క్రమంలో పాకిస్థాన్ చైనా నుంచి J-35AE స్టెల్త్ ఫైటర్లను సమకూర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వేళ రష్యా నుంచి వచ్చిన ఈ స్పందన ఎంతో ముఖ్యమైనది. రక్షణ రంగంలో భారత్‌తో తమకు ఎలాంటి పరిమితులు లేవని, సాంకేతికతలను బదిలీ చేయడంలో పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ పుతిన్ వ్యాఖ్యానించారు.

గతంలో 2018లోనే Su-57 ప్రాజెక్ట్‌లో భారత్‌తో కలిసి పనిచేయాలని రష్యా ఆహ్వానం ఇచ్చినప్పటికీ, భారత్ ఆ సమయంలో వెనక్కి తగ్గింది. ఆ విమానం తమ కార్యాచరణ అవసరాలను పూర్తిగా తీర్చలేదని భారత వైమానిక దళం (IAF) అభిప్రాయపడింది. ప్రస్తుతం భారత్ స్వయం సమృద్ధి దిశగా ‘అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రాజెక్ట్‌ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి ఈ స్వదేశీ ఐదో తరం జెట్ వైమానిక దళంలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు.

భారత్-చైనా వివాదంలో జోక్యం ఉండదు

పుతిన్ మరో ముఖ్యమైన వ్యాఖ్య చేస్తూ, భారత్-చైనా సంబంధాలు లేదా వారి మధ్య సరిహద్దు వివాదంలో రష్యా ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రెండు దేశాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ప్రతిపాదన భారత-రష్యా రక్షణ సహకారాన్ని మరింత బలపరుస్తుందని, రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News