Rare Hantavirus Scare on Cruise Ship: అరుదైన హంటావైరస్‌ కలకలం.. క్రూజ్‌ నౌక సముద్రంలో సహాయం కోసం ఎదురుచూపు

క్రూజ్‌ నౌక సముద్రంలో సహాయం కోసం ఎదురుచూపు

Update: 2026-05-05 08:52 GMT

Rare Hantavirus Scare on Cruise Ship: ఒక డచ్ క్రూజ్ నౌకలో అరుదైన హంటావైరస్ అనుమానిత వ్యాప్తి కలకలం సృష్టించింది. ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో నౌకలోని సుమారు 150 మంది ప్రయాణికులు, సిబ్బంది సముద్రంలోనే సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన వివరాల ప్రకారం, ఎంవీ హొండియస్ అనే ఈ డచ్ నౌక అర్జెంటీనా నుంచి బయల్దేరి అంటార్కిటికా వైపు వెళ్తోంది. అయితే ప్రయాణం మధ్యలో వైరస్ లక్షణాలు కనిపించడంతో కేప్ వెర్డే తీరానికి సమీపంలో నౌకను ఆపేశారు. స్థానిక అధికారులు ప్రజారోగ్య ఆందోళనలతో నౌకను రేవుకు అనుమతించడం లేదు. ప్రస్తుతం అది తీరానికి దూరంగా సముద్ర జలాల్లోనే నిలిచి ఉంది.

హంటావైరస్ వివరాలు:

ఎలుకల ద్వారా వ్యాపించే ఈ అరుదైన వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని గతంలోనే WHO హెచ్చరించింది. నౌకలో ఇప్పటికి 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు ల్యాబ్ ధృవీకరణ అయ్యాయి. ముగ్గురు మృతుల్లో ఒకరు జర్మన్ జాతీయుడు. అతని మృతదేహం ఇప్పటికీ నౌకలోనే ఉంది. ఒక వ్యక్తిని దక్షిణాఫ్రికాలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. మిగిలిన వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి.

నౌకలో 88 మంది ప్రయాణికులు, సుమారు 60 మంది సిబ్బంది ఉన్నారు. ఈ వైరస్ నౌకలోకి ఎలా వ్యాపించిందనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఎలుకల ద్వారా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మరోసారి మెలకువ కలిగించింది.

Tags:    

Similar News