Relief Amid LPG Shortage: ఎల్పీజీ కొరత మధ్య గుడ్ న్యూస్ – హర్మూజ్ దాటి భారత్ వైపు రెండు గ్యాస్ నౌకలు
హర్మూజ్ దాటి భారత్ వైపు రెండు గ్యాస్ నౌకలు
Relief Amid LPG Shortage: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరతపై ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, హర్మూజ్ జలసంధి దాటి భారత్ వైపు వస్తున్న రెండు ఎల్పీజీ నౌకల వార్త ఊరట కలిగిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 'జగ్ వసంత్' మరియు 'పైన్ గ్యాస్' అనే రెండు భారత్ జెండా నౌకలు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుమతితో సోమవారం ఉదయం హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. త్వరలోనే ఈ నౌకలు దేశీయ పోర్టులకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో దేశంలో ఎల్పీజీ లభ్యత మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. భారత్‌కు చెందిన అనేక నౌకలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. ఈ సంక్షోభం మధ్య భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరిపి, తమ నౌకలకు సురక్షిత మార్గం కల్పించేందుకు కృషి చేసింది.
ఇటీవలి కొన్ని రోజులుగా భారత నౌకలు ఒక్కొక్కటిగా జలసంధిని దాటి దేశీయ తీరాలకు చేరుకుంటున్నాయి. అయితే, ఇరాన్ సీనియర్ నాయకుడు అలీ లారిజానీ మరణం, అమెరికా దాడులు వంటి పరిణామాల వల్ల కొన్ని నౌకలకు అనుమతులు ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లోనూ రెండు ఎల్పీజీ నౌకలు సురక్షితంగా పయనమవడం భారత దౌత్య విజయంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం దేశంలో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నౌకల రాకతో వంటగ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గే అవకాశం ఉంది.