Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి

Update: 2026-03-02 05:43 GMT

Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై భీకర దాడులు చేసిన తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (86) మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన కార్యాలయం, నివాస ప్రాంతంపై జరిగిన భారీ బాంబు, క్షిపణి దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా ఆదివారం ఉదయం ఈ విషయాన్ని ధృవీకరించింది.

ఖమేనీ మృతి వార్త దావానలంలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. షియా ముస్లిం సమాజంలో తీవ్ర విచారం నెలకొంది. భారత్‌తో సహా పలు దేశాల్లో నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. పాకిస్థాన్‌లోని కరాచీలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణల్లో 10 మంది మృతి చెందారు. ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలు పాటించాలని ప్రకటించింది.

దాడి తర్వాత ఇరాన్ తీవ్ర ప్రతీకార దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలు, విమానాశ్రయాలకు నష్టం కలిగింది. ఇజ్రాయెల్‌లో 11 మంది, అమెరికా సైనికుల్లో ముగ్గురు మరణించారు. గల్ఫ్ ప్రాంతంలో మరికొందరు మృతి చెందారు, వందలాది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులు పేల్చామని ప్రకటించింది. పశ్చిమాసియాలో వందల విమానాలు రద్దయ్యాయి. భారత్ నుంచి సుమారు 220 విమానాలు రద్దు కావడంతో వేల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.

ఖమేనీతో పాటు ఇరాన్ సైనిక బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్‌రహీం మౌసావి, రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే, భద్రతా సలహాదారు అలీ శంఖానీ, ఐఆర్‌జీసీ కమాండర్ మహమ్మద్ పాక్‌పౌర్ వంటి కీలక వ్యక్తులు ఈ దాడుల్లో మరణించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ చమురు నౌకలు 9ను ముంచేశామని, నౌకాదళ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు.

ఖమేనీ వారసుడి ఎన్నిక నేడో రేపో జరగనుంది. ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్‌జీసీ తమ సుప్రీం లీడర్ మృతికి తగిన బదులు తీర్చుకుంటామని హెచ్చరించాయి. ఈ ఘటన పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత విస్తరింపజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News