Rising Tensions in Iran: ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు: భారతీయులు తక్షణమే దేశం వదిలి వెళ్లండి - కేంద్రం అడ్వైజరీ

భారతీయులు తక్షణమే దేశం వదిలి వెళ్లండి - కేంద్రం అడ్వైజరీ

Update: 2026-02-23 12:52 GMT

Rising Tensions in Iran: ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా దాడి చేసే అవకాశం ఉందన్న అంచనాల మధ్య విద్యార్థుల నిరసనలు ఊపందుకోవడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం (ఇండియన్‌ ఎంబసీ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. వెంటనే ఇరాన్‌ను విడిచిపెట్టి స్వదేశానికి తిరిగి రావాలని సూచించింది.

ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మారుతున్న నేపథ్యంలో, జనవరి 5న భారత ప్రభుత్వం ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ కొత్త అడ్వైజరీని విడుదల చేశారు. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు - విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, యాత్రికులు - అందుబాటులో ఉన్న వాణిజ్య విమాన సేవలు లేదా ఇతర ప్రయాణ మార్గాల ద్వారా తక్షణమే దేశం వదిలి వెళ్లాలని ఎంబసీ సూచించింది. భారతీయులు మరియు భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, స్థానిక మీడియా ద్వారా తాజా పరిణామాలను గమనిస్తూ ఉండాలని సలహా ఇచ్చింది.

అంతేకాకుండా, భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ మరియు ఇమిగ్రేషన్‌ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని ఎంబసీ తెలిపింది. ఏదైనా సహాయం అవసరమైతే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని, ఇప్పటివరకు ఎంబసీలో తమ వివరాలు నమోదు చేయకపోతే వెంటనే రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది.

ఇరాన్‌-అమెరికా మధ్య అణు ఒప్పంద చర్చలు ఇంకా సఫలమవలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలు పంపారు. ఇప్పటికే అమెరికా తన విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలను పశ్చిమాసియా ప్రాంతంలో మోహరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్‌లో మళ్లీ నిరసనలు చెలరేగాయి. వివిధ యూనివర్సిటీల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనలతో ఇరాన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా జరిగిన అల్లర్లలో 7,105 మంది మరణించారని అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తెలిపింది.

Tags:    

Similar News