Kim: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రష్యాకు నా మద్దతు: కిమ్

రష్యాకు నా మద్దతు: కిమ్;

Update: 2025-06-05 13:00 GMT

Kim:రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా నుంచి తిరుగులేని మద్దతు అందింది.  రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గి షోయుగు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బుధవారం పాంగ్యాంగ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భేషరతుగా మద్దతు ఇస్తున్నామని కిమ్ వెల్లడించినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.

ఉక్రెయిన్ తో యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైన అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల్లో రష్యా వైఖరిని తాము పూర్తిగా సమర్థిస్తున్నట్లు కిమ్ పేర్కొన్నారు. ఈ భేటీలో వీరిరువురూ రష్యా ఉత్తరకొరియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి  పలు అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కురుస్క్ ప్రాంతం పునర్నిర్మాణం అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియాలో షోయుగు పర్యటించడం ఈ ఏడాదిలో రెండోసారి. గత మార్చిలో షోయుగు ఉత్తర కొరియాలో పర్యటించినప్పుడు రష్యా తన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో అండగా ఉంటామని కిమ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున తమ బలగాలు పోరాటం చేస్తున్నాయన్న విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర కొరియా ధ్రువీకరించింది. ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే రష్యా కూడా వెల్లడించింది. రష్యా, ఉత్తరకొరియాల మధ్య జరిగిన పరస్పర రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ యుద్ధంలో ఉత్తర కొరియా సైన్యం ఎంతమంది పాల్గొన్నారనేది మాత్రం బయట పెట్టలేదు. ఉక్రెయిన్ నిఘా సంస్థ మరియు దక్షిణ కొరియా అధికారులు 10,000 నుంచి 12,000 మంది సైన్యం పాల్గొన్నారని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా సాంకేతికతను, అత్యున్నత ఆయుధాలు రష్యా ఉత్తరకొరియాకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం గత మూడేళ్లుగా కొనసాగుతుంది. దీనికి ముగింపు పలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగించి ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాడు.

Tags:    

Similar News