US President Donald Trump: హార్ముజ్ గడువు నేటితో ముగుస్తోంది.. ఇరాన్‌కు ట్రంప్ భీకర హెచ్చరిక!
ఇరాన్‌కు ట్రంప్ భీకర హెచ్చరిక!
US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిని నౌకల రాకపోకలకు వీలుగా తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్తు ఉత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా చేస్తామని హుంకరించారు. నేటి (ఏప్రిల్ 6, 2026) సాయంత్రం 8 గంటల (ఈస్టర్న్ టైమ్)తో గడువు ముగుస్తోంది.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఇలా రాశారు: “మంగళవారం ఇరాన్‌లో ‘పవర్ ప్లాంట్ డే’ మరియు ‘బ్రిడ్జ్ డే’ అవుతుంది. అన్నింటినీ ఒక్క దెబ్బతో కొట్టిపడేస్తాం. పిచ్చి మూర్ఖుల్లారా! జలసంధిని తెరవండి.. లేదంటే నరకాన్ని చూస్తారు. అల్లాహ్ మీకు దిక్కు!”
ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యం మరోసారి నిరూపితమైందని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్ ప్రాంతంలో కూలిన అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్‌ను ఆదివారం సాహసోపేతంగా కాపాడినట్లు ప్రకటించారు. ఆ పైలట్ తీవ్రంగా గాయపడినా, అతని సాహసం అసాధారణమని చెప్పారు.
ఈ కాపాడే ఆపరేషన్‌లో రెండు హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు పాల్గొన్నాయని, అత్యంత ప్రమాదకర ఆయుధాలతో సైనికులు ఇరాన్ భూభాగంలో ఏడు గంటలపాటు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇది అమెరికా సైనిక చరిత్రలో రెండు పైలట్లను శత్రు భూమిలోకి చొచ్చుకెళ్లి కాపాడిన తొలి సంఘటన అని గర్వంగా పేర్కొన్నారు.
“శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఇరాన్ దళాలు పైలట్ సమీపంలోకి వచ్చాయి. ఆ సమయంలో మేము 24 గంటలపాటు అతని స్థానాన్ని నిరంతరం గమనించాం. ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత శక్తివంతమైన సైన్యం మాది. దేవుడు అమెరికాను, మా సైనికులను ఆశీర్వదించాలి” అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.
అమెరికా జరిపిన భారీ దాడిలో ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు పలువురు మృతి చెందినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన నాయకులు ఈ దాడిలో లక్ష్యం చేసుకోబడ్డారని తెలిపారు.
హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇటీవలి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దీని వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్‌లో తీవ్ర అలజడి నెలకొంది. ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు గడువులు మార్చి చివరికి నేటి సాయంత్రం వరకు సమయం ఇచ్చారు.
ఇరాన్ వైపు నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అయితే, ఇరాన్ అధికారులు ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని, తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకు ప్రకటించారు.
ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ దేశాలు హర్మూజ్ జలసంధి సురక్షితమైన రాకపోకలకు పిలుపునిస్తున్నాయి.