అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్ సినిమాలకు తీసుకెళ్లండి - మిస్ జింబాబ్వే
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ సందడి నెలకొంది. ఈ పోటీలకు దాదాపు వంద దేశాల నుంచి వచ్చిన అందాల భామలు పొలిటెంట్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమ ఆసక్తిని, వింత వింత కోరికలను వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలోనే మిస్ జింబాబ్వే.. కార్ట్నీ తడివనాషే జోంగ్వే తన మనసులోని మాటలు చెప్పారు.
తెలుగు సినిమాలు చూడాలని చాలా ఆసక్తిగా ఉందని, దయచేసి తనను సినిమా హాల్‌కు తీసుకెళ్లండి అని రిక్వెస్ట్ చేసింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి తెలుగు స్టార్ల సినిమాలు తప్పకుండా చూడాలని మిస్ జింబాబ్వే చెప్పింది.
ఇది నిజంగా కల నిజమవడం లాంటిదని, భారత దేశంలో ఇక్కడి ప్రజలు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారని, ప్రతి క్షణం అద్భుతంగా అనిపిస్తోందని ఆమె చెప్పారు. భారత్‌లోని వంటకాలు తాను ఇప్పటివరకు కలలో కూడా ఊహించ లేదని, ఇక్కడి ఫుడ్ తమ దేశంతో పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. కానీ ప్రతి రుచిని ఆస్వాదించడంలోనే గొప్ప అనుభవం ఉందన్నారు. ఓపెనింగ్ సెరిమనీలో జరిగిన డాన్సులను చూసిన అనుభవం గురించి మాట్లాడుతూ, “అవి చూస్తూ నేను సినిమాలో ఉన్నట్లే అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది” అన్నారు.
తన బాలీవుడ్ అభిమాన హీరో గురించి చెబుతూ, “నేను బాలీవుడ్ సినిమాల్ని చూస్తూ పెరిగాను. నా ఫేవరెట్ షారుక్ ఖాన్. ఆయన నిజంగా ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. ఆయన సినిమా నాకు చాలా ఇష్టం” అని చెప్పారు. హైదరాబాదులో షాపింగ్ చేయాలని ఉత్సాహంగా ఉన్న ఆమె, “అందరికీ సారీ కావాలంటున్నారు. స్నేహితులు, బంధువులు అందరూ అడుగుతున్నారు. హైదరాబాదు అంటే అందమైన వస్త్రాలు గుర్తుకు వస్తాయి. నాకు తెలిసి ఖచ్చితంగా సారీ షాపింగ్ చేస్తాను” అన్నారు. ఆమె అన్న కూడా ఫోన్ చేసి అక్కడి మగవాళ్ల కోసం ఏదైనా ఉంటే తీసుకురమ్మని అడిగాడని చెప్పారు.
మొత్తానికి మిస్ జింబాబ్వే భారతదేశం గురించి, తెలుగు సంస్కృతి పట్ల వ్యక్తం చేసిన ఆత్మీయత, ఆసక్తి హైలైట్‌గా నిలిచింది.