America Launches Massive Attacks on Iran: చర్చలు ఒకవైపు.. దాడులు మరోవైపు: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

Update: 2026-05-27 05:01 GMT

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ ఘర్షణ

America Launches Massive Attacks on Iran: పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కోసం ఒకవైపు చర్చలు జరుగుతుంటే, మరోవైపు అమెరికా ఇరాన్‌పై తీవ్ర దాడులకు దిగింది. ఇరాన్ క్షిపణి ప్రయోగక్షేత్రాలు, సముద్రంలో మైన్‌లు నాటుతున్న పడవలను లక్ష్యంగా చేసుకొని అమెరికా సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున దాడులు చేసింది.

ఇరాన్ దళాల ముప్పు నుంచి తమ సైనికులను రక్షించుకోవడానికే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అమెరికా సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టిమ్ హాకిన్స్ వివరించారు. ఇరాన్ తీరం వెంట ఉన్న క్షిపణి స్థావరాలు తమ రెండు విమానవాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధనౌకలకు తీవ్ర ముప్పుగా మారాయని తెలిపారు. దాడుల్లో బందర్ అబ్బాస్ పోర్టులోని నౌకాదళ స్థావరం ధ్వంసమైందని, లర్క్ ద్వీపంలో కనీసం నలుగురు ఇరాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య వాషింగ్టన్‌లో మూడు రోజుల్లో ప్రత్యక్ష చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. హెజ్‌బొల్లా తమపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలపై ప్రతిదాడి చేసినట్లు ప్రకటించింది.

అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక దాడులు వంచనకు నిదర్శనమని మండిపడింది. దీని పర్యవసానాలకు అమెరికాదే బాధ్యత వహించాలని, దురాక్రమణలకు తగిన బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది.

అమెరికాకు పశ్చిమాసియా సురక్షితం కాదు: మొజ్తబా

పశ్చిమాసియా ప్రాంతం ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు సురక్షితం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఘాటు హెచ్చరికలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ఘటనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచినట్లు తెలుస్తోంది. చర్చలు, దాడులు ఒకేసారి కొనసాగడం అంతర్జాతీయ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

Tags:    

Similar News