Tensions Peak in the Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని దాటి ఇప్పటి వరకు సాఫీగా వెళ్తున్న నౌకలు కూడా ఇక కదలని పరిస్థితి ఏర్పడవచ్చు. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు) హర్మూజ్ దిగ్బంధం అమలు చేయనుందని ప్రకటించింది. ఎక్స్ వేదికపై ఈ మేరకు పోస్టు చేసి, ఇరాన్ పోర్టులకు వెళ్లే-వచ్చే అన్ని దేశాల నౌకలను హర్మూజ్ వద్ద అడ్డుకుంటామని స్పష్టం చేసింది. అయితే ఇరానేతర పోర్టులకు వెళ్లే నౌకలకు పెద్దగా ఆటంకాలు కలిగించమని తెలిపింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణించే వాణిజ్య నౌకల నావికులు ‘ఛానల్ 16’లో అమెరికా దళాలతో సంప్రదింపులు కలిగి ఉండాలని సూచించింది.

మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అమెరికా ప్రకటనకు తీవ్రంగా స్పందించింది. తమ సముద్ర కారిడార్‌లో ఎవరైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. తప్పుడు లెక్కలతో చేపట్టే చర్యలు శత్రువును జలసంధి సుడిగుండంలో మునిగిపోయేలా చేస్తాయని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. హర్మూజ్ పూర్తిగా ఇరాన్ దళాల ఆధీనంలోనే ఉందని వెల్లడించింది.

చమురు ధరలు భగ్గుమన్నాయి

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. నిన్న రాత్రి 11 శాతం పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్ల వద్దకు చేరాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ 104.2 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 101 డాలర్లను తాకాయి. హర్మూజ్ నుంచి జరుగుతున్న స్వల్ప స్థాయి చమురు, గ్యాస్ ఎగుమతులు కూడా నిలిచిపోవడంతో ఆసియా దేశాలకు తీవ్ర ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.

ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో

ఈ ఉద్రిక్తతల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు సుమారు 1 శాతం వరకు పతనమయ్యాయి.

Tags: