Prime Minister Narendra Modi: ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత బహుమతితో మోదీ సత్కారం: ఉగ్రవాదంపై సమిష్టి పోరు అవసరం
ఉగ్రవాదంపై సమిష్టి పోరు అవసరం
Prime Minister Narendra Modi: ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా అది ప్రపంచ శాంతికి పెద్ద ముప్పుగా మారుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ రాక్షసాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా, సమన్వయంతో పోరాడాలని పిలుపునిచ్చారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతి నెలకొల్పడంలో ఈ ప్రణాళిక కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ (కనెసెట్)లో మోదీ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కనెసెట్ అత్యున్నత బహుమతి 'స్పీకర్ ఆఫ్ ది కనెసెట్ మెడల్'తో ఆయన్ను సత్కరించారు.
రెండు రోజుల పర్యటన కోసం బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్న మోదీ, ముందుగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో సమావేశమయ్యారు. అనంతరం కనెసెట్‌లో ప్రసంగించారు. తమ పార్లమెంటులో మాట్లాడే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ, 'స్నేహం, గౌరవం, భాగస్వామ్యం' అనే సందేశాన్ని తాను తీసుకువచ్చానని చెప్పారు.
ఉగ్రవాదం నుంచి వచ్చిన వేదన మాకూ తెలుసు
2023 అక్టోబర్ 7న హమాస్ చేపట్టిన దాడుల్లో మరణించినవారి కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదాన్ని లేదా పౌరుల హత్యలను ఏ రకంగా సమర్థించలేమని అన్నారు. భారత్ కూడా ఉగ్రవాదం వల్ల తీవ్ర బాధ అనుభవించిందని గుర్తు చేశారు. "ముంబయి 26/11 దాడుల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇజ్రాయెల్ పౌరులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ మాదిరిగానే భారత్ కూడా ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించదు. దీనిపై పోరాటంలో ద్వంద్వ ధోరణులకు తావు లేదు. సమాజాలను అస్థిరపరచడం, అభివృద్ధిని అడ్డుకోవడం, విశ్వాసాన్ని దెబ్బతీసే లక్ష్యాలతో ఉగ్రవాదం పని చేస్తుంది. దీన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలు ఏకమై, స్థిరంగా కృషి చేయాలి. ఎందుకంటే ఉగ్రవాదం ఎక్కడైనా ఉంటే, అది ప్రపంచవ్యాప్తంగా శాంతికి హాని కలిగిస్తుంది" అని మోదీ వివరించారు.
గాజా శాంతి ప్రణాళికకు మద్దతు
గాజా శాంతి ప్రణాళికకు భారత్ మద్దతు ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ ప్రణాళిక ప్రాంతీయ శాంతికి బలమిస్తుందని అన్నారు. "భద్రతా మండలి ఆమోదం పొందిన గాజా శాంతి ప్రణాళిక, ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతిని స్థాపిస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. దీనికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో కూడా ఇది సహాయపడుతుందని విశ్వసిస్తున్నాం. వివేకవంతంగా, ధైర్యంగా, మానవీయంగా చర్యలు తీసుకుందాం" అని మోదీ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్ పలు దేశాలతో అబ్రహాం ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఇవి ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడ్డాయని, భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు అంతర్జాతీయ స్థిరత్వానికి కీలకమని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలపడుతుందని, సాంకేతికత, రక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.