Trump: వెనెజువెలాతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఒప్పందం: ట్రంప్ ప్రకటన
ట్రంప్ ప్రకటన
Trump: అమెరికా-వెనెజువెలా మధ్య ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణకు సంబంధించిన ఈ ఒప్పందం ఇరుదేశాలకు పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.
అగ్రరాజ్యంతో చేసుకున్న ఈ ఒప్పందంతో తమ దేశ పునరుద్ధరణ, 17 చమురు క్షేత్రాల అభివృద్ధి ముడిపడి ఉందని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెల్లడించారు. దీనివల్ల దాదాపు 100 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ఈ ఒప్పందం వెనెజువెలాకు బిలియన్ల కొద్దీ ప్రైవేట్ పెట్టుబడులను తీసుకువస్తుందని, అమెరికాలో గ్యాస్ ధరలు తగ్గడానికి దారితీస్తుందని తెలిపారు. కొనుగోలు చేసే చమురును వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నింపడానికి, సైనిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు.
ఆరు నెలలుగా ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధం వల్ల అమెరికాలో చమురు కొరత ఏర్పడుతోంది. హర్మూజ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో గ్యాస్ నిల్వలు పెంచుకోవడానికి ట్రంప్ వెనెజువెలాపై దృష్టి సారించారు. ప్రస్తుత ఒప్పందం ప్రకారం వెనెజువెలా చమురు ఉత్పత్తిలో కొంతమేర యాజమాన్య వాటాతో సహా అసలు ధరకే కొనుగోలు చేసే హక్కు అమెరికాకు ఉంటుంది.
అయితే ఈ ఒప్పందం కుదిరినప్పటికీ అమెరికాలో చమురు ధరలు వెంటనే తగ్గబోవని, వెనెజువెలా నుంచి చమురు వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.