Trump: అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల ముందు రోజు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లింకన్‌ మెమోరియల్‌ రిఫ్లెక్టింగ్‌ పూల్‌ వద్ద తన చివరి ప్రధాన ప్రసంగం చేశారు. రిపబ్లికన్‌ పార్టీ కాంగ్రెస్‌ నియంత్రణను కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కంటే రిఫ్లెక్టింగ్‌ పూల్‌ పునరుద్ధరణపైనే ఎక్కువ సమయం కేటాయించారు.

సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్‌.. ‘‘ఇది మా జీవితకాలంలో అత్యంత ముఖ్యమైన మిడ్‌టర్మ్‌ ఎన్నిక’’ అని పేర్కొన్నారు. అయితే ప్రసంగం మొదటి 20-25 నిమిషాలు రిఫ్లెక్టింగ్‌ పూల్‌ పైపులు, పెయింట్‌, ఆల్గే సమస్యలు, కొత్త నీలి రంగు లైనర్‌ వంటి విషయాలపైనే కేంద్రీకృతమైంది. ‘‘పైపులు పూర్తిగా పునరుద్ధరించాం. ఇప్పుడు ఇది గతం కంటే అందంగా ఉంది’’ అని చెప్పుకున్నారు. పూల్‌కు తన పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు జోక్‌ చేశారు.

గత కొన్ని నెలలుగా ఈ పూల్‌ పునరుద్ధరణలో సమస్యలు వచ్చాయి. నీలి రంగు లైనర్‌ ఒలిచి వచ్చి నీటిపై తేలుతూ ఉండటం, ఆల్గే వల్ల నీరు ఆకుపచ్చ రంగుకు మారడం వంటి సమస్యలు తలెత్తాయి. ట్రంప్‌ వీటిని వాండల్స్‌ చేసిన నష్టంగా ఆరోపించినా, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌, కాంట్రాక్టర్‌లు పని నాణ్యత లోపాల వల్లనే ఇవి జరిగాయని తేల్చారు. కొందరిపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకున్నారు.

ఓటర్లు ఆర్థిక సమస్యలు, ఇంధన ధరలు, మధ్యప్రాచ్యంలోని యుద్ధం వంటి అంశాలపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నప్పటికీ ట్రంప్‌ రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులపైనే దృష్టి సారించారు. డెమొక్రాట్లు దీన్ని విమర్శిస్తూ.. ట్రంప్‌ ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.

Tags: