Trump-Epstein Memorial Reading Room: ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ప్రజలకు ప్రత్యక్ష ప్రాప్యత: న్యూయార్క్‌లో 'ట్రంప్-ఎప్‌స్టీన్ మెమోరియల్ రీడింగ్ రూమ్' ఏర్పాటు
న్యూయార్క్‌లో 'ట్రంప్-ఎప్‌స్టీన్ మెమోరియల్ రీడింగ్ రూమ్' ఏర్పాటు
Trump-Epstein Memorial Reading Room: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్‌కు సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇప్పుడు ప్రజలు నేరుగా చదవడానికి అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ట్రైబెకా ప్రాంతంలో ఈ ఫైల్స్‌ను ప్రదర్శించే 'డొనాల్డ్ జె. ట్రంప్ అండ్ జెఫ్రీ ఎప్‌స్టీన్ మెమోరియల్ రీడింగ్ రూమ్' అనే ప్రత్యేక రీడింగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మే 8 నుంచి 21 వరకు ఈ ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
అమెరికా న్యాయశాఖ ఇటీవల దశలవారీగా విడుదల చేసిన సుమారు 35 లక్షల పేజీల ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను 3,700 వాల్యూమ్‌లుగా ముద్రించి ఈ రీడింగ్ రూమ్‌లో ఉంచారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రైమరీ ఫ్యాక్ట్స్ అనే ఎన్‌జీఓ ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. భారీ స్థాయిలో ఉన్న ఈ డాక్యుమెంట్లు సుమారు 17,000 పౌండ్ల బరువున్నట్లు తెలిసింది. అపాయింట్‌మెంట్ తీసుకున్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. భద్రతా కారణాలతో గ్యాలరీ పూర్తి చిరునామాను రహస్యంగా ఉంచారు.
ఈ ఎగ్జిబిషన్‌లో ఎప్‌స్టీన్-ట్రంప్ మధ్య సంబంధాలపై కాలక్రమానుసారంగా వివరాలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఎప్‌స్టీన్ వర్గం చేసిన నేరాలు, వాటిని కప్పిపుచ్చడానికి జరిగిన ప్రయత్నాలపై దృష్టి సారించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ ఏర్పాటు చేశామని ఎన్‌జీఓ వెల్లడించింది.
ఎప్‌స్టీన్ కేసు సంబంధిత డాక్యుమెంట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి భారీ స్థాయిని భౌతిక రూపంలో చూపించడం ద్వారా ప్రజల దృష్టిని మరోసారి ఆకర్షించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ప్రదర్శన 16 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.