Trump: ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ సందిగ్ధ స్థితి
ట్రంప్ సందిగ్ధ స్థితి
Trump: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్సుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. దాడులకు దిగితే పెద్ద యుద్ధం, విధ్వంసం తప్పదనే భయం ఒకవైపు... దాడి చేయకపోతే తన ప్రతిష్ఠకు తీవ్ర దెబ్బ తగిలే అవకాశం మరోవైపు—ఈ రెండు మధ్య ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
ఇరాన్‌తో జెనీవాలో ఒమన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న పరోక్ష చర్చలు ఇంకా ఫలవంతం కాలేదు. అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపాలని అమెరికా గట్టిగా హెచ్చరిస్తుండగా, ఇరాన్ మాత్రం ఆపే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తోంది. చర్చలు విఫలమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఆ మాటను గట్టిగా నొక్కి చెప్పలేకపోతున్నారు.
అమెరికా సైన్యాన్ని భారీగా తరలించిన తర్వాత కూడా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకపోతే తనకు అప్రతిష్ఠ తప్పదని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దౌత్యపరమైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక దూత విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌లు జెనీవాలో చర్చల్లో పాల్గొంటున్నారు.
ఇరాన్ వైపు నుంచి కొన్ని సానుకూల ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. యురేనియం శుద్ధీకరణ, ఆయుధ గ్రేడ్ పదార్థాల నిల్వలపై కొంత వెసులుబాటు చూపేందుకు ఇరాన్ సిద్ధపడవచ్చని తెలుస్తోంది. అయితే క్షిపణుల అభివృద్ధి విషయంలో మాత్రం రాజీకి దూరంగా ఉండవచ్చు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సైనిక చర్యకు సంబంధించిన బెదిరింపులను ఇరాన్ సీరియస్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే అమెరికా లోపల కూడా ట్రంప్ నిర్ణయంపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఇరాన్ అణు కార్యక్రమం ప్రమాదకరమే అని అంతా భావిస్తున్నప్పటికీ, యుద్ధానికి దిగడం సరైనదేనా అనే సందేహం వ్యక్తమవుతోంది.
ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్‌బుసైదీ మాట్లాడుతూ, చర్చల్లో రెండు దేశాలూ సానుకూల, సృజనాత్మక ఆలోచనలతో ఉన్నాయని, అయితే ఫలితాలు ఇంకా అనిశ్చితిగానే ఉన్నాయని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ట్రంప్ తుది నిర్ణయం ఏమిటవుతుందనేది అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.