ట్రంప్, మస్క్ ఓ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు...

Update: 2025-06-05 11:02 GMT
  • ట్రంప్, మస్క్ మధ్య బంధం ముగిసినట్లేనా?
  • ఇద్దరి మధ్యా పెరిగిన దూరం
  • అమెరికా వ్యయభారం తగ్గించాలని మస్క్ కు టాస్క్
  • ఆ ప్రతిపాదనలు నడుస్తుండగానే ట్రంప్ సొంత బిల్లులు
  • ఇష్టానుసారం బిల్లులతో చెలగాటమాడుతున్న ట్రంప్
  • పొమ్మన లేక పొగబెడ్తున్నారన్న సందేహాలు
  • ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ బిల్లులతో విదేశీయులకు దూరం
  • ఈలోగా ముంచుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు
  • DOGE పదవీకాలం ముగియడంతో తప్పుకున్న మస్క్
  • తన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ట్రంప్ పై యుద్ధం
  • సంక్షోభ నివారణకు మస్క్ పూర్తిగా వెళిపోలేదంటూ కవరింగ్
  • అయినా కిల్ ది బిల్ పేరుతో ఆగని మస్క్ యుద్ధం

పాలు, నీళ్లలా కలిసిపోతుందనుకున్న బిలియనీర్ ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య బంధం బీటలేసింది. ఆర్ధికంగా చితికిపోయిన అమెరికాను సంపన్న దేశంగా మారుస్తానంటూ కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు ట్రంప్.. ట్రంప్ అధికారంలోకి రావడానికి అడుగడుగునా సాయపడింది బిగ్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వీరిద్దరిదీ క్షణ క్షణమూ ఆర్ధిక బంధమే. ట్రంప్ ను గెలిపించడానికి సేకరించిన విరాళాలలో 250 మిలియన్ డాలర్లను తన వంతు విరాళంగా ప్రకటించారు మస్క్. ట్రంప్ ప్రచార ప్రణాళిక MAGAను డిజైన్ చేసినది కూడా మస్కే.తద్వారా ట్రంప్ అంతర్గత బృందంలో నమ్మకస్తుడుగా మస్క్ స్థానం సంపాదించారు.

సలహాదారుగా చేరి...

ట్రంప్ గెలిచేందుకు తన ప్రణాళిక, ప్రచారం, సోషల్ మీడియా మద్దతుతో ఇతోధికంగా సాయపడిన ఎలన్ మస్క్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ కు పాలనపరమైన సలహా బోర్డుకు (DOGE) అడ్వైజర్ పదవిని తీసుకున్నారు.

అమెరికా ప్రభుత్వంలో అనవసర ఖర్చుపై కోత విధించడం, ఆర్ధిక లోటును పూడ్చేందుకు ప్రణాళికలు ఇవ్వడం, వాషింగ్టన్ కేంద్రంగా సాగుతున్న కార్యకలాపాలను సిలికాన్ వ్యాలీ కాన్సెప్ట్ తో అడ్డుకోవడం లాంటి చర్యలన్నింటికి వెనుకా మస్క్ ప్రణాళిక దాగుంది. తన బాధ్యతల ప్రకారం మస్క్ తన మకాంను కూడా మారలాగోకు మార్చారు. తరచుగా పబ్లిక్ ర్యాలీలలో కనిపించడంతో పాటు, బడ్జెట్ బ్రీఫింగ్స్ లో, కేబినెట్ భేటీలలో కూడా ప్రధాన వ్యక్తిగా నడుచుకున్నారు. ప్రతీ ముఖ్యమైన మీటింగులోనూ మస్క్ ఉన్నారు.

దూరంపెంచిన బిగ్ బ్యూటిఫుల్..

అడుగడుగునా ట్రంప్ ఆదేశానుసారం మస్క్ నడుచుకున్నారు.అమెరికా బడ్జెట్ ను కుదించాలని తనకు టార్గెట్ పెట్టిన ట్రంప్ తన అనుమతి లేకుండా, సంప్రదించకుండా తీసుకొచ్చిన ది బిగ్ బ్యూటి ఫుల్‌ బిల్లు ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచింది. పన్నుల్లో కోత,రుణపరిమితిని ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచడం, సరిహద్దుల రక్షణ, రక్షణ పరమైన చర్యల పేరుతో ఇతోధికంగా ధన వ్యయాన్ని సూచిస్తున్నదే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. ట్రంప్ ఈ బిల్లును వారసత్వ విజయ సంకేతంగా చూస్తుంటే మస్క్ దీనిని అత్యంత నాసిరకమైన దరిద్రగొట్టు బిల్లుగా అభివర్ణిస్తున్నారు. మస్క్ తన ఎక్స్ వేదికగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా యుద్ధం కూడా మొదలు పెట్టేసారు. ఈ బిల్లును రుణ బానిసత్వం పెంచే బిల్లుగా, ఇప్పటికే తడిసి మోపెడైన బడ్జెట్ భారాన్ని మరింత కొండంతగా మారుస్తుందని హెచ్చరించారు.దేశం అప్పుల కు కట్టే వడ్డీలో ఇప్పటికే 25 శాతం ఫెడరల్ రెవిన్యూలో లోటుగా ఉందని,మరో దశాబ్దంలో అమెరికా పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోతుందని హెచ్చరించారు.దేశ అప్పులు తీర్చడానికే ఉన్న సొమ్మంతా అయిపోతుందన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకొస్తే సామాజిక భద్రత,వైద్య పరమైన భద్రత కరువై, భద్రత పరమైన సమస్యలూ తలెత్తుతాయని మస్క్ అన్నారు.

బిల్లుతో మస్క్ కు నష్టం...

అంతేకాదు ఈ బిల్లు మస్క్ సొంత వ్యాపారాలకు ఎసరుతెచ్చేదిగా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై 7,500 డాలర్ల ఫెడరల్ టాక్స్‌ కోతలు ఈ బిల్లు విధిస్తోంది. దీనివల్ల మొదట దెబ్బ తినేది మస్క్ కంపెనీ టెస్లాయే. ఇప్పటికే తొలి వార్షికంలో కంపెనీ సేల్స్ 13 శాతం పడిపోయాయి. లాభాల్లో 71 శాతం క్షీణత కనిపిస్తోంది.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవల కోసం తన కంపెనీ స్టార్ లింక్ కు అనుమతులు కోరారు మస్క్. ఈప్రతిపాదనలకు నో చెప్పారు ట్రంప్.

దీనికి తోడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ బిల్లుకు చేస్తున్న సవరణలు, కొత్త ప్రతిపాదనలు మస్క్ ఉనికిని కూడా ప్రశ్నించేవే. ఆ బిల్లుల ప్రకారం మస్క్ కూడా అమెరికాలో ఉండేందుకు అర్హుడు కాదు. ఇలా ప్రతీ బిల్లు తనకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుతుండటంతో మస్క్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అమెరికా రుణభారాన్ని తడిసి మోపెడు చేసే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు మస్క్ అసహనం తారస్థాయికి చేరేదిగా తయారైంది. దీనిపై మీడియాకు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్య్యూ ఆయన ఎగ్జిట్ కు కారణమైంది.

ఈలోగా DOGE బోర్డు అడ్వైజర్ గా ఆయన పదవీ కాలం ముగిసింది. నిజానికి సంబరంగా జరుపుకోవాల్సిన సందర్భాం కూడా కలసి రాలేదు. పదవీ కాలం పొడిగింపుకు నోచుకోలేదు. మస్క్ దయ చేయవచ్చని ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ స్థాయి అధికారి డిసైడ్ చేశారంటేనే ఆయన కథ ఇక ముగిసినట్లే అని అర్ధం చేసుకోవాలి.

మస్క్ పరోక్ష యుద్ధం..

అయితే పదవినుంచి తప్పుకున్న మస్క్ తన సోషల్ మీడియా వేదికల నుంచి యుద్ధం మొదలు పెట్టారు. ఆ బిల్లు అమెరికాను సర్వనాశనం చేసే బిల్లని, కొంపలు ఆర్పేసే బిల్లని దానిని అందరూ వ్యతిరేకించాలంటూ కిల్ ది బిల్ ఉద్యమం మొదలుపెట్టారు. మీమ్స్, గ్రాఫ్స్,కిల్ ది బిల్ స్టైల్ ఆర్ట్ వర్క్ ను ప్రమోట్ చేయడం ద్వారా ట్రంప్ ను టార్గెట్ చేశారు. దమ్ముంటే ఈ బిల్లుకి రిపబ్లికన్లలో ఎవరైనా మద్దతు తెలపాలంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మస్క్ చేసిన ఈ పనికి సెనేట్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.

పెచ్చరిల్లుతున్న ఈ వివాదాన్ని సరిదిద్దే పనిలో పడిన ట్రంప్ మస్క్ నిజంగా ప్రభుత్వాన్ని వదిలి వెళ్లడం లేదని సంక్షోభ నివారణా మంత్రాన్ని పఠించారు.అయితే ఎలన్ మస్క్ మాత్రం తను చేయాల్సిన డ్యామేజ్ చేసేశారు. తన సామాజిక మాధ్యమాల వేదికల పై ట్రంప్ ను ఉతికి ఆరేస్తున్నారు. అమెరికా సంపదను లూటీ చేసే మాఫియా లీడర్ గానూ, ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చే వినాశకుడుగానూ ట్రంప్ ను పోలుస్తూ యుద్ధం ఉథృతం చేశారు.

Tags:    

Similar News