Trump Refuses to Sign Proposed Deal with Iran: ఇరాన్‌తో డీల్‌పై సంతకం చేయడానికి నిరాకరించిన ట్రంప్
నిరాకరించిన ట్రంప్
Trump Refuses to Sign Proposed Deal with Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి తిరిగి మొదలైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు మరియు హార్ముజ్ సంప్రదాయ మార్గంలో దిగ్బంధనం ఎత్తివేతకు సంబంధించిన తాత్కాలిక ఒప్పందం విషయంలో ట్రంప్ తన సలహాదారులతో శ్వేతసౌధం సిచ్యువేషన్ రూమ్‌లో దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ ఒప్పందంపై సంతకం చేయకుండానే సమావేశం ముగించి వెళ్లిపోయారు.
వైట్‌హౌస్ అధికారులు ఈ విషయంపై వివరిస్తూ, "ఇరాన్‌తో ఏ ఒప్పందమైనా అమెరికా ప్రయోజనాలను కాపాడేదిగా ఉండాలి. టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలి. ముఖ్యంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేసుకోకూడదు" అని స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ "అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకా తుది ఒప్పందం ఖరారు కాలేదు" అని తెలిపారు.
యుద్ధం మళ్లీ ప్రారంభించే సత్తా ఉంది: హెగ్సెత్
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "అవసరమైతే ఇరాన్‌తో యుద్ధం తిరిగి ప్రారంభించే సత్తా మనకు ఉంది. మా ఆయుధ నిల్వలు నిండుగా ఉన్నాయి" అని అన్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా పశ్చిమాసియాలో తమ దళాలు అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది.