Donald Trump: ట్రంప్ కాంగ్రెస్‌కు వార్ నోటిఫికేషన్: ఇరాన్‌పై మళ్లీ 60 రోజుల సైనిక చర్యలు?
60 రోజుల సైనిక చర్యలు?
Donald Trump: పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో దద్దరిల్లుతోంది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరో 60 రోజులపాటు సైనిక దాడులు చేయనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు ఫార్మల్ నోటిఫికేషన్ ఇచ్చి, ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ మేరకు 'వార్ పవర్స్' నోటీసు జారీ చేశారు. జులై 7న ఈ యుద్ధ చర్యలు మొదలైనట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ట్రంప్ తన నోటీసులో “అమెరికా ప్రజలను, జాతీయ భద్రతను, విదేశాంగ విధానాలను రక్షించడం నా ప్రధాన బాధ్యత. దీనికి అనుగుణంగా సైనిక చర్యలకు ఆదేశించాను” అని స్పష్టం చేశారు.
60 రోజుల డెడ్‌లైన్ వివరాలు
అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి ఈ అధికారం లేదు. అయినప్పటికీ, అధ్యక్షులు సైనిక చర్యలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా గరిష్ఠంగా 60 రోజుల వరకు కొనసాగించవచ్చు. శత్రు భూమిపై సైనికులను పంపిన 48 గంటల్లోగా కాంగ్రెస్‌కు తెలియజేయాలి. 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం పొందకపోతే చర్యలు ఆపాలి. అయితే, సైనికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు.
గతంలో ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 60 రోజుల డెడ్‌లైన్ మే 1తో ముగిసింది. అనంతరం అనేక దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం తొలి దశ సైనిక చర్యలు నిలిపివేశారు. కానీ తాజా ఘర్షణల నేపథ్యంలో మళ్లీ సైనిక చర్యలు ప్రారంభించడానికి ఈ నోటిఫికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే రాజ్యాంగ నిపుణులు ఈ వాదనను వ్యతిరేకిస్తూ, తాత్కాలిక దౌత్య విరామాలను శాశ్వత యుద్ధానికి మార్గం సుగమం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులు పశ్చిమాసియాలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.