Trump Warns: పుతిన్‌ను లక్ష్యంగా తోమహాక్ క్షిపణులతో: ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ హెచ్చరిక
Trump Warns: ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని అంతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు 2,000 దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణులు సరఫరా చేయాలని ట్రంప్ నిర్ణయించారు. పుతిన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని స్వయంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో పుతిన్‌తో ఫోన్ కాల్ వివరాలు పంచుకున్న ట్రంప్, ఉక్రెయిన్‌కు తోమహాక్ క్షిపణులు అందించవద్దని పుతిన్ కోరారా? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, 'ఉక్రెయిన్‌కు తోమహాక్‌లు ఇవ్వండి, నేను సంతోషిస్తాను' అని పుతిన్ అనుకుంటారా? అంటూ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. తన ప్రత్యర్థికి 2,000 తోమహాక్ క్షిపణులు ఇస్తే మీకు అభ్యంతరం ఉంటుందా? అని తాను పుతిన్‌ను అడిగానని చెప్పారు. దీనికి పుతిన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ట్రంప్ తెలిపారు. 'నిజంగా అలాగే చెప్పాను. పుతిన్‌కు ఈ ఆలోచన ఏమాత్రం నచ్చలేదు. తోమహాక్ అత్యంత విధ్వంసకరమైన ఆయుధం. అలాంటి దీర్ఘశ్రేణి క్షిపణులు తమపై దాడి చేయాలని ఎవరూ కోరుకోరు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ కూడా ట్రంప్‌తో ఫోన్ కాల్‌లో తోమహాక్ క్షిపణుల గురించి చర్చ జరిగిందని ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌కు వీటిని అందించడం వల్ల అమెరికా-రష్యా సంబంధాలు మరింత దెబ్బతినవచ్చని పుతిన్ హెచ్చరించారని ఆయన చెప్పారు. మరోవైపు, ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం ద్వారా పుతిన్‌తో జరిగిన సంభాషణ అద్భుతంగా సాగిందని ట్రంప్ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశం జరగనుందని, అక్కడ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కీలక చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.