Donald Trump: ట్రంప్‌: తైవాన్ స్వాతంత్ర్యం కోసం మేము యుద్ధం చేయబోము

మేము యుద్ధం చేయబోము

Update: 2026-05-16 11:16 GMT

తైవాన్ అంశంపై వైఖరి మార్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Donald Trump: తైవాన్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమకు క్లిష్టమైన సమస్య అని, భౌగోళికంగా చాలా దూరంలో ఉండటం వల్ల వేగంగా స్పందించడం కష్టమని వెల్లడించారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం అంత దూరం ప్రయాణించి యుద్ధం చేయాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు.

చైనా పర్యటన ముగించి తిరిగి వచ్చిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ‘‘తైవాన్ అంశం చాలా క్లిష్టమైన సమస్య. ఈ ద్వీపం చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంటే, అమెరికాకు 15 వేల కి.మీ. పైగా దూరంలో ఉంది. ఇంత దూరం వల్ల వేగంగా చర్య తీసుకోవడం కష్టం. చైనా బలమైన, పెద్ద దేశం. ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన బాధ్యత చైనా, తైవాన్ రెండింటిపైనా ఉంది’’ అని అన్నారు.

తైవాన్ స్వాతంత్ర్య ఆకాంక్షల కోసం అమెరికా సైనికంగా జోక్యం చేసుకోదని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇంతకాలం అమెరికా తైవాన్‌కు మద్దతు ఇస్తూ, చైనా ఏకపక్ష చర్యలకు వ్యతిరేకంగా నిలుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తైవాన్‌కు ఆయుధాలు అందించాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పడం ఈ మార్పును సూచిస్తోంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ట్రంప్‌తో జరిపిన చర్చల్లో తైవాన్ సమస్యను సరిగ్గా నిర్వహించకపోతే అమెరికా-చైనా మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తైవాన్‌ను తన భాగంగా విలీనం చేసుకోవాలని చైనా ఎప్పటి నుంచో కోరుకుంటోంది. ఈ కీలక అంశంపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు దృష్టి ఆకర్షిస్తున్నాయి.

Tags:    

Similar News