UK Strongly Condemns: బంగ్లాదేశ్‌లో మైనారిటీల హత్యలను తీవ్రంగా ఖండించిన బ్రిటన్
హత్యలను తీవ్రంగా ఖండించిన బ్రిటన్
UK Strongly Condemns: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న హింసాత్మక దాడులపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గట్టిగా స్పందించారు. ఇటీవల జరిగిన దీపూ చంద్రదాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్ అనే ముగ్గురు హిందూ వ్యక్తుల దారుణ హత్యలను తీవ్రంగా ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
దీపూ చంద్రదాస్ హత్య కేసులో బంగ్లాదేశ్ పోలీసులు 12 మందిని అరెస్టు చేసిన చర్యను, అలాగే తాత్కాలిక ప్రభుత్వం అన్ని వర్గాల భద్రత కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను బ్రిటన్ ప్రధాని స్వాగతించారు. ప్రజల మత స్వేచ్ఛ, విశ్వాసాల రక్షణకు యూకే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్టార్మర్ స్పష్టం చేశారు.
నవంబర్‌లో బ్రిటన్ మంత్రి జెన్నీ చాప్‌మన్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్‌ను కలిసినప్పుడు కూడా మైనారిటీల భద్రత అంశాన్ని లేవనెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. పౌర హక్కులు, మానవ హక్కుల రక్షణలో, అవినీతి నిర్మూలనలో బంగ్లాదేశ్‌కు బ్రిటన్ నిరంతర మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు.
బంగ్లాదేశ్‌లో ఇటీవలి అల్లర్ల నేపథ్యంలో ఇస్లాంకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్‌పై అల్లరి మూకలు దాడి చేసి హత్య చేశాయి. మరో సంఘటనలో డబ్బు వసూళ్ల ఆరోపణలతో అమృత్ మండల్‌ను గ్రామస్థులు కొట్టి చంపారు. మంగళవారం బజేంద్ర బిశ్వాస్‌ను అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి హత్య చేశాడు. హిందువులపై వరుస దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ హింసాత్మక ఘటనలు బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతలకు ముప్పుగా మారాయి. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై దృష్టి పెట్టి, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.