Sheikh Hasina’s Strong Criticism: యూనస్‌ ప్రభుత్వానికి హింసను అరికట్టే శక్తి లేదు: షేక్‌ హసీనా తీవ్ర విమర్శలు

షేక్‌ హసీనా తీవ్ర విమర్శలు

Update: 2025-12-23 06:44 GMT


బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడి హత్యతో చెలరేగిన ఆందోళనలపై మాజీ ప్రధాని స్పందన


Sheikh Hasina’s Strong Criticism: బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్య అనంతరం చెలరేగిన హింసాత్మక ఆందోళనలపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా తీవ్రంగా స్పందించారు. మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హింసను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. దేశంలో హింస సాధారణ దృశ్యంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు.

ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఈమెయిల్‌ ఇంటర్వ్యూలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్య తర్వాత ఢాకాలో జరిగిన హింసాత్మక ఘటనలు దేశాన్ని మరింత అస్థిరపరుస్తున్నాయి. ఈ హత్య యూనస్‌ పాలనలో పెరిగిపోతున్న అరాచకాలకు ప్రతిబింబం. హింస సాధారణమైపోయింది. ఈ అల్లరులు బంగ్లాదేశ్‌ ఆంతరిక స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా, పొరుగు దేశాలతో సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నాయి. మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మేం నిర్మించిన వ్యవస్థల క్షీణతను భారత్‌ ఆందోళనతో చూస్తోంది. శాంతిభద్రతలను కాపాడలేని ప్రభుత్వం అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోతుంది’’ అని ఆమె హెచ్చరించారు.

యూనస్‌ సర్కారు ఇస్లామిక్‌ తీవ్రవాద శక్తులకు తలుపులు తెరిచి పెడుతోందని హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు.

భారత్‌కు కృతజ్ఞతలు

యూనస్‌ ప్రభుత్వమే భారత్‌తో శత్రుత్వ వాతావరణం సృష్టిస్తోందని షేక్‌ హసీనా అన్నారు. ‘‘భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాలు లోతైనవి. తాత్కాలిక ప్రభుత్వం పోయినా అవి కొనసాగుతాయి. భారత్‌ చూపిస్తున్న సంఘీభావానికి నేను కృతజ్ఞురాలిని. అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటిగా నిలవడం నాకు బలం కలిగించింది. రక్తపాతం నివారించేందుకే నేను దేశం విడిచి వచ్చాను’’ అని ఆమె స్పష్టం చేశారు.

విదేశాంగ విధానం మార్చే అధికారం లేదు

బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానాన్ని మార్చే అధికారం యూనస్‌కు లేదని హసీనా డొంక తిరిగించారు. ఎన్నికలు లేని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ భవిష్యత్తును దీర్ఘకాలం ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు. ‘‘ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం వచ్చిన వెంటనే మా విదేశాంగ విధానం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతుంది. తీవ్రవాదుల భావజాలానికి కాదు. ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ తీర్పు న్యాయపరమైనది కాదు, రాజకీయ ప్రతీకారం. నాకు న్యాయవాదులు ఎంచుకునే హక్కు కూడా ఇవ్వలేదు. అవామీ లీగ్‌పై రాజకీయ వేట ఇది. రాజ్యాంగ వ్యవస్థపై నా నమ్మకం ఇంకా చెక్కుచెదరలేదు’’ అని షేక్‌ హసీనా పేర్కొన్నారు.

Tags:    

Similar News