United States Prepares: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధం!

అమెరికా సన్నద్ధం!

Update: 2026-05-23 09:43 GMT

United States Prepares: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఏ క్షణంలోనైనా ప్రకటన అవుతుందని ఆశలు వ్యక్తమవుతుండగా, మరోవైపు ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తోందని నివేదికలు వెలువడుతున్నాయి.

చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. అధికారులను ఉటంకిస్తూ వచ్చిన ఈ నివేదికలు ప్రస్తుత పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.

శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు కీలక సైనిక, భద్రతా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇరాన్‌తో చర్చలు విఫలమైతే వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించే అంశంపై వారు విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశం అనంతరం వైట్‌హౌస్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మెమోరియల్ డే సందర్భంగా న్యూజెర్సీకి వెళ్లాలని ట్రంప్ ముందు నిర్ణయించుకున్నా, ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వైట్‌హౌస్‌లోనే ఉండనున్నారు. పలువురు సైనిక, నిఘా అధికారులు కూడా తమ వ్యక్తిగత ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

ఇరాన్‌పై దాడుల సన్నాహాల నేపథ్యంలోనే ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి హాజరు కావడం లేదని తెలిపారు. ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ, "నా కుమారుడి పెళ్లి చూడాలని ఎంతో ఆశగా ఉంది. కానీ ప్రభుత్వ సంబంధిత కీలక పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోతున్నాను. ఈ సమయంలో వైట్‌హౌస్‌లో ఉండటం అత్యంత ముఖ్యం" అని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఇవి విఫలమైతే పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News