United States: చమురు సంక్షోభంలో కాలిపోతున్న అమెరికా!

కాలిపోతున్న అమెరికా!

Update: 2026-03-12 11:50 GMT

ఇరాన్‌పై దాడులతో ట్రంప్‌ లెక్కలు తప్పాయి – ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం

United States: అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ఇరాన్‌ ఇచ్చిన ప్రతిస్పందనతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సలహాదారుల అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే వరకు యుద్ధం వల్ల వచ్చే సమస్యలు పెద్దవి కావని భావించిన వారి ఆలోచనలు తప్పుడు లెక్కలుగా నిరూపితమయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు భారీ చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది.

ముందే ఆలోచించి ఉంటే...

ఇరాన్‌పై దాడులు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ట్రంప్‌ ఉన్న సమయంలోనే, ఇంధనశాఖ మంత్రి క్రిస్‌ వైట్‌ ధీమాగా ప్రకటించారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం రాదని, మార్కెట్లలో సంక్షోభం తలెత్తదని చెప్పారు. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌పై దాడులు జరిగినప్పుడు కూడా ఇంధన మార్కెట్లో స్వల్పంగా ఒడిదొడుకులు వచ్చినా త్వరలోనే స్థిరపడ్డాయని ఉదాహరణగా చూపారు. ట్రంప్‌ సలహాదారుల్లో కొందరు కూడా ఇదే వాదన వినిపించారు. రెండోసారి దాడులు చేస్తే ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న హెచ్చరికలను వారు పట్టించుకోలేదు.

ఆందోళనలు నిజమయ్యాయి

కానీ ఇప్పుడు ఆ ఆందోళనలన్నీ నిజమయ్యాయి. ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మూసివేసింది. గతం కంటే ఈసారి రవాణా నౌకలపై మరింత భారీ దాడులకు దిగుతోంది. దీంతో పర్షియన్‌ గల్ఫ్‌లో చమురు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికన్లపై ఈ ధరల భారాన్ని తగ్గించడానికి ట్రంప్‌ ప్రభుత్వం తీవ్రంగా తలపడుతోంది.

కనెక్టికట్‌ డెమోక్రాటిక్‌ సెనేటర్‌ క్రిస్టోఫర్‌ ఎస్‌. మర్ఫీ మంగళవారం ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. హర్మూజ్‌ జలసంధిని తెరిపించడానికి ట్రంప్‌ ప్రభుత్వంలో ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదని, ఏం చేయాలో తెలియడం లేదని ఆయన విమర్శించారు. ట్రంప్‌ యంత్రాంగంలోని కొందరు అధికారులు కూడా యుద్ధ పరిణామాలపై నిరాశతో ఉన్నారని తెలుస్తోంది, అయితే వారు బహిరంగంగా మాట్లాడటం లేదు.

ఇరాన్‌ సీమైన్లను (మైన్లు అమర్చే నౌకలు) హర్మూజ్‌లో మోహరిస్తోంది. దీంతో అమెరికా వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ప్రతిగా ఇరాన్‌ నేరుగా చమురు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇది యుద్ధ తీవ్రతను మరింత పెంచేసింది.

ఈ పరిణామాలతో అమెరికా ఇంధన సంక్షోభంలో కాలిపోతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ సంక్షోభం ఎంత ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Tags:    

Similar News