US Announces: మొజ్తాబా ఖమేనీఆచూకీపై రూ.93 కోట్ల బహుమతి – అమెరికా కీలక ప్రకటన
అమెరికా కీలక ప్రకటన
US Announces: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారనే సమాచారం ఇచ్చే వారికి అమెరికా భారీ బహుమతి ప్రకటించింది. ఆయనపై సమాచారం అందించే వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.93 కోట్లు) ఇస్తామని యుఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇది ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, భద్రతా అధికారి అలీ లారిజానీతో పాటు పలువురు ఇరాన్ అధికారులపై కూడా వర్తిస్తుంది.
యుఎస్ విదేశాంగ శాఖ 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' కార్యక్రమం ద్వారా ఎక్స్‌లో ఈ ప్రకటన చేసింది. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ద్వారా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించింది. సమాచారం ఇచ్చే వారికి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ లేదా టోర్ నెట్‌వర్క్ ద్వారా రహస్యంగా తెలియజేయవచ్చని సూచించింది. అలాగే, సమాచారం అందించిన వారికి తగిన బహుమతితో పాటు పునరావాసం (రీలొకేషన్) కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మొజ్తాబా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన ఆచూకీపై స్పష్టత లేకపోవడంతో అమెరికా ఈ బహుమతి ప్రకటన చేసింది.
ఈ చర్య ఇరాన్ నాయకత్వంపై అమెరికా ఒత్తిడి పెంచేందుకు భాగమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.