US-Iran Peace Talks: అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ ప్రతినిధి బృందం

ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ ప్రతినిధి బృందం

Update: 2026-04-11 05:52 GMT

US-Iran Peace Talks: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడి శాంతి చర్చలు ముందుకు సాగాలంటే... ఇరాన్ వైపు నుంచి ముందస్తు షరతులు తీరాలని స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఏప్రిల్ 10న శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్‌కు చేరుకుంది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ రాకను అధికారికంగా ధృవీకరించింది.

ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ఈ బృందంలో రక్షణ మండలి కార్యదర్శి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో పాటు పలువురు సీనియర్ రాజకీయ, సైనిక, ఆర్థిక నాయకులు ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన రెండు విమానాలు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగాయని ఫ్లైట్ రాడర్-24 సమాచారం ఇచ్చింది.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ సభ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, హోమ్ మంత్రి మొహ్సిన్ నక్వీలతో సహా ఉన్నతాధికారులు విమానాశ్రయంలో ఇరాన్ బృందానికి ఘన స్వాగతం పలికారు.

ఈ చర్చలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లోని సెరీనా హోటల్‌లో జరగనున్నాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. గత ఆరు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి రెండు వారాల కాల్పుల విరమణ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

అయితే, ఇరాన్ మీడియా స్పష్టం చేసినట్లు... అమెరికా ముందస్తు షరతులకు అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగతాయి. అమెరికాపై నమ్మకం లేదని ఇరాన్ వైపు నుంచి వ్యక్తమవుతున్న అనుమానాల నడుమ ఈ చర్చలు కీలకమైన మలుపును తీసుకురావాలని అంతర్జాతీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ముందుగానే ఈ చర్చలకు ఆతిథ్యం ఇస్తామని ప్రకటించారు. భద్రతా కారణాలతో డెలిగేషన్ల రాకపోకలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఇరాన్ బృందం రాకతో ఉత్కంఠకు తెరపడింది.

ఈ శాంతి చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్య ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే, ఇరు వైపులా ఉన్న అనుమానాలు, ముందస్తు షరతులు చర్చలను క్లిష్టతరం చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News