US President Donald Trump: హర్మూజ్‌ జలసంధి తెరవండి.. లేదంటే తీవ్ర దాడులు ఎదుర్కోండి: ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

Update: 2026-08-05 07:52 GMT

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్‌ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని, లేదంటే తీవ్రమైన సైనిక చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇరాన్‌తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ, ఆ దేశం వాటిని బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందని ట్రంప్‌ అన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్‌ను హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడికి అమెరికా సిద్ధమవుతున్న సమయంలోనే ఇరాన్‌ తమను సంప్రదించి చర్చలకు రావాలని కోరిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. టెహ్రాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని మళ్లీ నొక్కి చెప్పారు.

హర్మూజ్‌ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలకు సంబంధించి ఇరాన్‌, ఒమన్‌తో కలిసి చర్చలు జరుపుతున్నామని అమెరికా ప్రకటించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్‌ ఖండించింది. ఒమన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో అమెరికా భాగస్వామ్యం ఏమాత్రం లేదని, తమ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడే కొత్త సముద్ర రవాణా విధానం ఏర్పాటుపైనే ఈ చర్చలు సాగుతున్నాయని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మలుపు తిరుగుతాయన్నది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News