PAK Defence Minister Khawaja Asif: అమెరికా పాక్‌ను టాయిలెట్ పేపర్‌లా వాడేసి పారేసింది: రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు
రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు
PAK Defence Minister Khawaja Asif: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా తన రాజకీయ అవసరాలు, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వాడుకుని, తర్వాత టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపారేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆసిఫ్ ఖవాజా మాట్లాడారు. 1999 తర్వాత అఫ్గానిస్థాన్ విషయంలో అమెరికాతో చేతులు కలపడం తాము చేసిన అతిపెద్ద తప్పిదమని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ భారీ నష్టాలు పొందిందని, దాని పర్యవసానాలను ఇప్పటికీ భరిస్తోందని వాపోయారు.
1999లో అప్పటి సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలో సైన్యం ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం చేజిక్కించుకుందని ఆసిఫ్ గుర్తుచేశారు. 2001 తర్వాత అమెరికా మద్దతుతో తాలిబన్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే, తాలిబన్లు తిరిగి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అమెరికా ఎలాంటి సహాయం అందించలేదని ఆరోపించారు.
అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని, అవసరం తీరిన తర్వాత వదిలేసిందని ఆసిఫ్ ఖవాజా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో గత సైన్యాధిపతులు జియా-ఉల్-హక్, ముషారఫ్ నిర్ణయాలు కూడా తప్పులేనని సూచించారు. ఈ సంబంధాల వల్ల దేశం ఆర్థికంగా, భద్రతాపరంగా తీవ్ర నష్టపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.