USA: అమెరికా WHO నుంచి అధికారికంగా వైదొలిగింది.. రూ.2,382 కోట్ల బకాయి
రూ.2,382 కోట్ల బకాయి
USA: అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా ఉపసంహరణ పొందింది. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అదుపు చేయడంలో, అవసరమైన సంస్కరణలను అమలు చేయడంలో WHO విఫలమైందని అమెరికా ఆరోగ్య మరియు మానవ సేవల శాఖ (HHS) స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం ఫలితంగా, ఇకపై WHOకు అమెరికా నుంచి ఎలాంటి నిధులు అందించబోమని, జెనీవాలోని ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న WHO కార్యాలయాల నుంచి అమెరికా సిబ్బందిని వెనక్కి పిలిచారు. సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
అయితే, పరిమిత పరిధిలో మాత్రమే WHOతో కలిసి పనిచేస్తామని అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో WHO నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు. 2025 జనవరి 20న తన మొదటి రోజునే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, జనవరి 22, 2026న ఈ ఉపసంహరణ అమలులోకి వచ్చింది.
ఈ సమయంలో అమెరికాకు WHOపై దాదాపు 260 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,382 కోట్లు) బకాయిలు ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ వంటి నివేదికలు తెలిపాయి. అయితే, ఈ బకాయిలను చెల్లించకుండానే అమెరికా బయటకు వచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉపసంహరణతో అమెరికా తన 'అమెరికా ఫస్ట్' విధానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. WHO సంస్కరణలు చేపట్టకపోవడం, చైనా ప్రభావం, కరోనా సమయంలో విఫలాలు ఇందుకు ప్రధాన కారణాలుగా అమెరికా పేర్కొంది.