Walmart Halts Hiring of H-1B Visa Applicants : వాల్‌మార్ట్‌: ట్రంప్‌ నిర్ణయంతో హెచ్‌-1బీ వీసా అభ్యర్థుల నియామకాలు పూర్తిగా నిలిపివేత!

హెచ్‌-1బీ వీసా అభ్యర్థుల నియామకాలు పూర్తిగా నిలిపివేత!

Update: 2025-10-22 09:40 GMT

Walmart Halts Hiring of H-1B Visa Applicants : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హెచ్‌-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం అక్కడి కంపెనీలలో తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించింది. దీని ప్రభావంతో వీసా అభ్యర్థులను నియమించుకోవడంలో సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. తాజాగా, అమెరికా రిటైల్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ (Walmart) కూడా ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది.

హెచ్‌-1బీ వీసా అభ్యర్థులను నియమించుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని వాల్‌మార్ట్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం వాల్‌మార్ట్‌లో 2 వేలకు పైగా హెచ్‌-1బీ వీసా హోల్డర్లు పనిచేస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి. ఈ అంశంపై సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. హెచ్‌-1బీ వీసా నియామక విధానాలను జాగ్రత్తగా సమీక్షిస్తున్నామని తెలిపారు. తమ కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రతిభావంతులైన వ్యక్తులను నియమించుకోవడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన ఒకేసారి ఫీజు మాత్రమే అని వైట్‌హౌస్‌ తర్వాత స్పష్టం చేసింది. ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రభుత్వం తమ మార్గదర్శకాలను సవరించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. అమెరికాలో ఉండి వీసా స్టేటస్‌ మార్చుకునేవారికి, ఇప్పటికే హెచ్‌-1బీ వీసా ఉండి కొనసాగింపు కోరేవారికి ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదని తెలిపింది. విదేశాల నుంచి నేరుగా హెచ్‌-1బీ వీసాలకు అప్లై చేసేవారు మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.

Tags:    

Similar News