War Turns Devastating: యుద్ధం విధ్వంసకరంగా మారుతోంది: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భారీ దాడులు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భారీ దాడులు

Update: 2026-03-05 05:07 GMT

War Turns Devastating: అమెరికా-ఇజ్రాయెల్‌తో ఇరాన్ మధ్య యుద్ధం భయంకర విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఇరాన్ నాయకత్వం, భద్రతా బలగాలు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సంయుక్త దళాలు నిరంతర దాడులు చేస్తున్నాయి. యుద్ధం ఐదో రోజుకు చేరుకున్న బుధవారం రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై భారీ బాంబు దాడులు జరిగాయి.

ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్ తూర్పు ప్రాంతంలోని ఇరాన్ సైనిక ప్రధాన కేంద్రంపై 100 ఫైటర్ జెట్లతో 250 బాంబులు వేసింది. ఈ కేంద్రంలో ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్), ఖుద్స్ ఫోర్స్, నిఘా డైరెక్టరేట్, బసీజ్ పారామిలిటరీ ఫోర్స్, సైబర్ యూనిట్, ప్రత్యేక బలగాలు, అంతర్గత భద్రత యూనిట్లు ఉన్నాయి. టెహ్రాన్‌లో తెల్లవారుజామునుంచే యుద్ధ విమానాలు భారీ శబ్దాలతో దూసుకొచ్చి భవనాలను నేలమట్టం చేశాయి. షియాల కేంద్రమైన ఖోమ్ సహా ఇతర నగరాలపైనా దాడులు జరిగాయి.

ఇజ్రాయెల్ ఒక ఇరాన్ యాక్-130 యుద్ధ విమానాన్ని తమ ఎఫ్-35తో కూల్చేసినట్లు ప్రకటించింది. గత రెండు రోజుల్లో వేల మంది ఇరాన్ సైనికులను అంతమొందించామని రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్ కమాండర్ కర్నల్ అలెఫ్ తెలిపారు. మంగళవారం ఇస్ఫహాన్‌లోని క్షిపణుల నిల్వ, ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్ శివార్లలోని రహస్య అణ్వస్త్ర కేంద్రం 'మిన్జాదే'ను కూడా ధ్వంసం చేశామని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. ఈ ప్లాంటును 2025లో ధ్వంసం చేసిన తర్వాత ఇరాన్ మళ్లీ నిర్మించుకుందని వారు చెప్పారు.

ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. జెరూసలెంలో భారీ పేలుళ్లు సంభవించాయి. సౌదీ అరేబియాలోని రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై మళ్లీ డ్రోన్ దాడి జరిగింది, అయితే నష్టం లేదని తెలిపారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. బాల్‌బెక్‌లో ఒక ఇంటిపై దాడిలో ఐదుగురు, బీరుట్‌పై దాడుల్లో ఆరుగురు మరణించారు.

ఇరాన్ మృత వీరులు, వెటరన్స్ ఫౌండేషన్ ప్రకారం ఇప్పటివరకు 1,045 మంది మరణించారు. ఇరాన్ తదుపరి సుప్రీం నేతగా అయతోల్లా ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఎన్నిక కానున్నట్లు సమాచారం. ఏ ఒక్కరు సుప్రీం లీడర్ అయినా వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో సైనిక, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News