Iran: ఇరాన్ మాజీ అధ్యక్షుడిని టార్గెట్ చేసిన మొస్సాద్?.. సంచలన రహస్య ఆపరేషన్ ప్లాన్ వెలుగులోకి!

ప్లాన్ వెలుగులోకి!

Update: 2026-07-14 08:45 GMT

Iran: ఇరాన్‌పై అణువాయుధాల నియంత్రణను తన లక్ష్యంగా చెప్పుకుంటున్న ఇజ్రాయెల్, వాస్తవంలో టెహ్రాన్‌ను రాజకీయంగా, సైనికంగా బలహీనపరచాలని భావిస్తోందని సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీనెజాద్‌ను ఎరగా వేసి, తమ వైపు తిప్పుకోవాలని కొన్నేళ్లుగా పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో అహ్మదీనెజాద్ నివాస కాంపౌండ్‌పై కూడా బాంబులు పడ్డాయి. అయినప్పటికీ మాజీ అధ్యక్షుడు సురక్షితంగా బయటపడ్డారు. సినిమాలోని థ్రిల్లర్ లాగా ఒక కారు ఆయన్ని భవనం నుంచి కాపాడి రహస్య స్థలానికి తరలించింది. ఈ ఆపరేషన్‌లో మొస్సాద్ ఏజెంట్లు పాల్గొన్నట్లు ఇరాన్ అధికారులు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి అహ్మదీనెజాద్‌పై ఇరాన్ నిఘా పెంచింది.

2023 నుంచి మొస్సాద్ ట్రాప్:

నెజాద్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇజ్రాయెల్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. 2023లో గ్వాటెమాలా పర్యటన సమయంలో మొస్సాద్ సభ్యులతో మొదటి సమావేశం జరిగినట్లు సమాచారం. 2024లో హంగేరీలోని ఒక యూనివర్సిటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు అప్పటి మొస్సాద్ చీఫ్ డేవిడ్ బార్నియాతో రహస్య భేటీ జరిగింది. ఫిబ్రవరి యుద్ధం మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు కూడా హంగేరీలో మరో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనల్లో అహ్మదీనెజాద్ భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా కొన్ని గంటలు అదృశ్యమయ్యేవారని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి.

ప్లాన్ ఫెయిల్ అయిన తర్వాత:

ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి, అహ్మదీనెజాద్‌ను తమకు అనుకూల లీడర్‌గా నిలబెట్టాలని ఇజ్రాయెల్ ఆశించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనతో విభేదాలు తలెత్తాయి. దాడుల సమయంలో తనను కాపాడిన ఆపరేషన్‌పైనే అహ్మదీనెజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. రహస్య స్థలం నుంచి బయటపడిన తర్వాత ఆయన బయటి ప్రపంచానికి కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఇటీవల ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించినా మాట్లాడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కస్టడీలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అహ్మదీనెజాద్ 2005-2013 మధ్య ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్‌ను అంతం చేస్తానని బహిరంగంగా ప్రకటించేవారు. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కూడా పునఃప్రారంభించారు. అయితే అధికారం వదిలాక ఆయన వైఖరి మారినట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌కు అనుకూల వ్యాఖ్యలు చేయడం, విదేశీ పర్యటనల్లో ఆంగ్లంలో మాట్లాడడం వంటి చర్యలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. 2017లో ట్రంప్, సౌదీ యువరాజుకు లేఖలు పంపడం కూడా ఇరాన్ ప్రభుత్వ దృష్టికి చేరింది.

Tags:    

Similar News