Iran New Supreme Leader: ఇరాన్ భవితవ్యం ఏమవుతుంది? ఖమేనీ మరణంతో కొత్త సుప్రీం లీడర్ రేసు హీటెడ్.. వారసత్వం కాదు, స్థిరత్వమే లక్ష్యం!

వారసత్వం కాదు, స్థిరత్వమే లక్ష్యం!

Update: 2026-03-02 05:51 GMT

Iran New Supreme Leader: ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ఇరాన్‌కు తీవ్రమైన దెబ్బ. 37 ఏళ్ల పాటు దేశాన్ని ఇనుపపిడికిలితో పాలించిన ఆయన వియోగం టెహ్రాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించినట్లు వెంటనే అధికార మార్పిడి జరిగే అవకాశం మాత్రం లేదు. సుప్రీం లీడర్ లేకపోయినా పాలన సజావుగా కొనసాగాలంటే అవసరమైన వ్యవస్థలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కొత్త నాయకుడి నియామకానికి స్పష్టమైన చట్టపరమైన మార్గాలు కూడా ఉన్నాయి.

సుప్రీం లీడర్ స్థానం ఖాళీ అయినప్పుడు ముగ్గురు సభ్యుల ‘నాయకత్వ మండలి’ బాధ్యతలు చేపట్తుంది. ఇందులో దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, న్యాయవ్యవస్థ అధిపతి ఘొలామ్ హొసీన్ మొహ్‌సెనీ ఎజెహీ, ఆయతుల్లా అలీ రెజా అరాఫీలు సభ్యులుగా ఉన్నారు. ఖమేనీ మరణంతో ఈ మండలి ఇప్పటికే పాలనా బాధ్యతలు చేపట్టింది.

తదుపరి సుప్రీం లీడర్ ఎవరు?

ఈ నిర్ణయం 88 మంది షియా మతపెద్దలతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ కమిటీ చేతుల్లో ఉంది. ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకున్న ఈ కమిటీ సభ్యులు మెజారిటీ ఓట్లతో కొత్త నాయకుడిని ఎంపిక చేస్తారు. సుప్రీం లీడర్‌ను తొలగించే అధికారం కూడా వీరికే ఉంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆయతుల్లా రూహుల్లా ఖొమైనీ, తర్వాత ఖమేనీ ఈ పదవి చేపట్టారు.

ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ (56) ప్రస్తుతం బలమైన ఆకాంక్షి. అయితే ఆయనకు ప్రభుత్వ అనుభవం లేదు. వారసత్వ రాజకీయాలు మత సిద్ధాంతాలకు వ్యతిరేకమని, మతపెద్దల కమిటీపై ప్రజల్లో ఆగ్రహం పెరగొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇతర ఆకాంక్షులు ఎవరు?

అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయన సంస్థ ‘కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ నివేదిక ప్రకారం ఖమేనీ సన్నిహిత సలహాదారుడు హుజ్జతుల్ ఇస్లాం మొహ్సేన్ కోమి, ఆయతుల్లా అలీ రెజా అరాఫీ, ఆయతుల్లా మొహ్సేన్ అరాకీ, న్యాయవ్యవస్థ అధిపతి ఘొలామ్ హొసీన్ మొహ్‌సెనీ ఎజెహీ, ఆయతుల్లా హషేం హోస్సేని బుషెహ్రి వంటి ప్రముఖులు కూడా రేసులో ఉన్నారు.

అమెరికా పిలుపు.. ప్రజలు స్పందిస్తారా?

తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ఇరాన్ ప్రజలను ప్రభుత్వం పై తిరుగుబాటుకు పిలిచారు. కానీ ఇరాన్ సాయుధ బలగాల వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయి. నిరాయుధులైన ప్రజలు వాటిని ఎదుర్కోవడం కష్టం. 1990-91 గల్ఫ్ యుద్ధంలో అమెరికా ఇరాక్ ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహించి, తర్వాత మనసు మార్చుకొని వారికి షాక్ ఇచ్చింది. ఆ సంఘటనలు ఇంకా ఇరాక్, చుట్టుపక్కల దేశాల ప్రజల మనసులో ముద్రపడి ఉన్నాయి. కాబట్టి అమెరికాను నమ్మి ఇరాన్‌వాసులు తిరుగుబాటు చేసే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్ రాజకీయాల్లో ఇప్పుడు కీలకమైన దశ మొదలైంది. కొత్త సుప్రీం లీడర్ ఎవరు అవుతారో, దేశ భవితవ్యం ఏ దిశగా సాగుతుందో.. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News