Donald Trump Change His Stance: ట్రంప్ మనసు ఎందుకు మారింది? ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు ఆకస్మిక శాంతి మంత్రంగా మార్చుకున్నారు!

ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు ఆకస్మిక శాంతి మంత్రంగా మార్చుకున్నారు!

Update: 2026-04-09 03:13 GMT

Donald Trump Change His Stance: ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని, ఇక గడువు పెంచేది లేదని తీవ్ర స్వరంతో హూంకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకస్మికంగా మనసు మార్చుకున్నారు. కొన్ని గంటల ముందు వరకు దుర్భాషలతో అవతలివారిపై విరుచుకుపడుతూ, ఇదే చివరి రాత్రి అని హెచ్చరించిన ట్రంప్‌ ఒక్కసారిగా శాంతి సందేశం అందించడం పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయన బెదిరింపులు ఫలించాయా? కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది? అన్నీ ప్రశ్నార్థకాలుగా మారాయి.

సుదీర్ఘకాలిక యుద్ధాలపై అమెరికా విముఖత, హర్మూజ్‌ జలసంధి నియంత్రణపై పట్టు సాధించడం ఆషామాషీ కాకపోవడం, ఆర్థిక భారం భారీగా ఉండటం వంటి అంశాలు ట్రంప్‌ను వెనక్కి తగ్గించాయని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్‌ నేతృత్వంలోని మధ్యవర్తులు, ఇరాన్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా కలిసి ఘర్షణను మరింత పెంచకూడదని అమెరికాకు గట్టి సందేశాలు పంపాయి. అమెరికాలోని డెమోక్రటిక్‌ శాసనసభ్యులు ట్రంప్‌ హెచ్చరికల్ని తీవ్రంగా ఖండించి, ఇది నైతిక ఓటమి అని ఆరోపించారు. పోప్‌ లియో కూడా ట్రంప్‌ తీరును తప్పుబట్టారు.

అధ్యక్ష ఎన్నికల సమయంలో అంతులేని యుద్ధాల నుంచి అమెరికాను బయటపడేస్తానని ట్రంప్‌ ఇచ్చిన హామీ కూడా ఆయన్ను ఇప్పుడు వెనక్కి తగ్గేలా చేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

హర్మూజ్‌ జలసంధి నియంత్రణ ఖర్చుతో కూడుకున్నది

ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం పర్షియన్‌ గల్ఫ్‌లోని హర్మూజ్‌ జలసంధి ద్వారా వెళ్తుంది. దీన్ని నియంత్రించాలంటే ఇరాన్‌ భూభాగంలోని 600 కి.మీ. ప్రాంతంపై అమెరికా సైన్యం పట్టు సాధించాలి. క్షిపణి దాడులను అడ్డుకోవడానికి మాత్రమే 30,000 నుంచి 45,000 మంది సైనికులు అవసరం. ఏళ్ల తరబడి వారిని అక్కడ ఉంచడం, ఆర్థిక భారం – గతంలో అఫ్గానిస్థాన్‌, వియత్నాం యుద్ధాల్లో చెల్లించుకున్న మూల్యం ట్రంప్‌ ప్రభుత్వానికి పునరాలోచన కలిగించిందని స్పష్టమవుతోంది.

అన్ని నిర్ణయాలకూ రెండు వారాలే!

రెండు వారాల గడువు ట్రంప్‌కు ఇష్టమైన కాలవ్యవధి. ఇరాన్‌పై దాడి నిర్ణయానికి ముందు కూడా ఆయన ఇదే గడువు ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని అంతం చేస్తానని ప్రకటించినప్పుడు కూడా రెండు వారాల గడువే పెట్టారు. ఈ శైలి ట్రంప్‌ రాజకీయ వ్యూహంలో భాగమని తెలుస్తోంది.

ప్రస్తుతం కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందో, పశ్చిమాసియా పరిస్థితి ఎలా మారుతుందో రాబోయే రోజులు చెప్పనున్నాయి. ట్రంప్‌ మనసు మార్పు అమెరికా విదేశాంగ విధానంలో కొత్త మలుపు తీసుకువస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News