కొందరు పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసలు - కేటీఆర్
బీఆర్ఎస్ నాయకుల మీద ఉల్టా కేసులు పెట్టి వేధిస్తున్నారు;
కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసల్లాగా పని చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు హెచ్చరించారు. కాంగ్రెస్ గుండాల చేతిలో దాడికి గురైన బీఆర్ఎస్ లీడర్లపైనే ఉల్టా కేసులు పెట్టి వేధించే చిల్లర పోలీసింగ్ తెలంగాణలో నడుస్తుందన్నారు. రీట్విట్ చేసినందుకే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న పోలీసులు, పెట్రోల్ పోసీ కాలబెడతానని ఒక ఎమ్మెల్యేను బెదిరించిన కాంగ్రెస్ నాయకుడిపై కేసు పెట్టలేని పిరికివాళ్లలాగా మారిపోవడం విషాదకరం అన్నారు. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ మల్కాజ్ గిరి బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన కేటీఆర్, హైదరాబాదులో ఒక్క సీటు కూడా రాలేదన్న కోపంతో ఇక్కడి ప్రజల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందన్నారు. రౌడీయిజం, గుండా గిరితో నగరంలోని శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే కుట్రలు చేస్తుందన్నారు. చిల్లర రాజకీయాలు, గుండా గిరితో తమను భయపెట్టాలనుకుంటున్న రేవంత్ రెడ్డి, ఆయన తొత్తులు దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారని కేటీఆర్ హెచ్చరించారు.
కేటీఆర్ కామెంట్స్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు హైదరాబాదులో ఎన్నడూ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నక్సలైట్ల సమస్య వస్తుందని, ఘర్షణలు జరుగుతాయని కొందరు విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఎలాంటి సమస్య రాలేదు. రౌడీషీటర్లు, గుండాల సమస్య లేకుండా హైదరాబాద్ మహానగరం కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఉంది. దేశానికే దిక్సూచీలా అభివృద్ధి చెందింది.
హైదరాబాద్ అభివృద్ధి, శాంతి భద్రతలను చూసి ఇక్కడి ప్రజలు 2018, 2023 ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని అందించారు. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2017 జిహెచ్ఎంసి ఎన్నికల్లో 99 సీట్లను ఇచ్చారు. 2020లో కూడా మళ్లీ బీఆర్ఎస్ కే జిహెచ్ఎంసి పీఠాన్ని కట్టబెట్టారు. హైదరాబాదులో ఒక్క సీటు కూడా రాలేదన్న కోపంతో ఇక్కడి ప్రజల మీద పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి రౌడీయిజం, గుండా గిరి చేస్తుంది.
మల్కాజ్ గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగాయి. మెడ మీద తలకాయ ఉన్న ఎవరైనా సరే మల్కాజ్ గిరి చౌరస్తాలో గుండాలను తీసుకొచ్చి గంటసేపు ట్రాఫిక్ జామ్ చేసి బస్తీమే సవాల్ అంటూ చిల్లర రాజకీయం చేస్తాడా? మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, మా నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం తప్ప కాంగ్రెస్ గుండాలను నియంత్రించే దమ్ము పోలీసులకు లేదా? మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం అధికారం ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీనే.
దేవుడి కార్యక్రమానికి వెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులపై గుండాలతో కలిసి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. అధికారం ఎవడి అబ్బ సొత్తు కాదు. శాశ్వతం కాదు. మళ్ళీ మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పని చేస్తున్న అధికారులను రేపు మళ్లీ మా ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం. చేసి చూపెడతామని హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసలు లాగా పనిచేస్తున్న పోలీస్ అధికారులు బీఆర్ఎస్ నాయకులు రాము యాదవ్, జగదీష్ గౌడ్, చిన్న యాదవ్ మీద 7 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారు.
కార్పొరేటర్ సబితమ్మ మీద దాడి చేసి గాయపరిచారు. ఇదేనా రాజకీయం? ఇదేనా కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది. మీకు దమ్ముంటే మా కంటే ఎక్కువ హైదరాబాద్ ను అభివృద్ధి చేసి చూపించి ప్రజల మనసు గెలవండి. అంతేకానీ గుండాలు, రౌడీల లాగా మల్కాజ్ గిరి చౌరస్తాలో కూర్చొని బస్తీ మే సవాల్ అంటూ చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు హర్షించరు. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చిన విద్యావంతులు మల్కాజ్ గిరిలో ఉంటున్నారు. మిలిట్రీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేయడానికి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చాలామంది వచ్చి స్థిరపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఈ గుండా గిరిని వాళ్ళు ఛీకొడుతున్నారు..
సిద్దిపేటలో హరీష్ రావు కార్యాలయం పై ఒక మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేసి విధ్వంసం సృష్టించి, పెట్రోల్ పోసి హరీష్ రావు ను తగలబెడతానని పోలీసుల ముందే హెచ్చరిస్తే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందులు ఈ రాష్ట్ర పోలీసులు. శశిధర్ గౌడ్ అనే యువకుడు రిట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టిన పోలీసులు, ఒక పెట్రోల్ పోసి తగలబెడతానని హరీశ్ రావును బెదిరించిన కాంగ్రెస్ చిల్లర నాయకుడి మీద కేసు పెట్టలేదు. ఇదేనా పోలీసింగ్ అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసల్లాగా ఏకపక్షంగా పనిచేస్తున్న ఏ ఒక్క పోలీస్ అధికారిని వదిలిపెట్టేది లేదు.
పక్క రాష్ట్రంలోనూ ఇలాగే వ్యవహరించిన ఐపీఎస్ అధికారి సర్వీస్ కు రాజీనామా చేసి వెళ్లిపోయాడు. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ నాయకులకు పార్టీ అండగా ఉంది. ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు డిజిపి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. పదేళ్లలో ఏం చేశామో మేము చెప్తాము. మీరు ఏం చేశారో చెప్పే దమ్ముందా? చిల్లర రాజకీయాలు, గుండా గిరితోని భయపెట్టి బెదిరిస్తామని అనుకుంటే రేవంత్ రెడ్డి తో పాటు ఆయన తొత్తులు దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బాగా పనిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి రాలేదన్న అసహనంతోనే ఆయన మీద దాడి చేస్తున్నారు. దాడికి గురైన బీఆర్ఎస్ నాయకుల మీదనే ఉల్టా కేసులు పెట్టేంత చిల్లర పోలీసులు దేశంలో ఎక్కడా లేరు. డిజిపిని కలుస్తాము. శాసనసభలోను ఎండబెడతాము. ఎవరెవరిని కలవాలో వాళ్ళందర్నీ కలుస్తాము. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మల్కాజ్ గిరి బీఆర్ఎస్ నాయకులతో ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మీతోనే ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక ఫోన్ చేస్తే చాలు మొత్తం పార్టీ మల్కాజిగిరి కి వస్తుంది. ప్రభుత్వం మీద పోరాటాన్ని ఇలాగే కొనసాగించండి. అండగా ఉంటాము.