నారా లోకేష్ 66వ రోజు ప్రజాదర్బార్
Nara Lokesh's 66th day Praja Darbar;
ఆపద ఏదైనా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం ఉండవల్లి నివాసంలో 66వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు స్వయంగా మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. ప్రతిఒక్కరి అర్జీ పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిఒక్కరికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితుడు మోసం చేశాడు
- తమ కుమారుడికి పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అండతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట, వాడపాలెంకు చెందిన సజ్జల సన్నిహితుడు అడపా ప్రేమ్ చంద్, గుత్తుల అవినాష్, కట్టెవాటి బాలిరెడ్డి రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తాను మెడికల్ సీటు గురించి ప్రశ్నించగా.. అప్పటి సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానంటూ రెండు కోట్లు డిమాండ్ చేశారు. అంత సొమ్ము చెల్లించలేమని చెప్పడంతో తాము కట్టిన నగదుకు బెంగుళూరులోని రామయ్య మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి సీట్ అలాట్ మెంట్ కు సంబంధించి నకిలీ లేఖను చేతిలో పెట్టి మోసం చేశారు. నగదును తిరిగి ఇవ్వాలని కోరగా సజ్జల పేరుచెప్పి బెదిరిస్తున్నారు. తప్పుడు పత్రాలతో తమను మోసం చేశారని, తమకు రావాల్సిన నగదును తిరిగి ఇప్పించాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- మంగళగిరి నియోజకవర్గం కంతేరులో తమ కుటుంబానికి చెందిన 0.70 ఎకరాల వ్యవసాయ భూమిని ఐదేళ్ళ క్రితం విక్రయించామని, అయితే పొలం విక్రయం తాలూకా బాకీ ఉన్న రూ.12 లక్షల నగదు ఇవ్వకుండా గ్రామానికి చెందిన విష్ణు, రాము తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఉండవల్లికి చెందిన కల్లం విజయలక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారం లేని తమకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- ఎస్ఎంఏ(స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ) అనే ప్రాణాంతక జన్యు వ్యాధితో బాధపడుతున్న తమ 9 నెలల బాలుడికి వైద్యసాయం అందించి చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన జొన్నాడ సాయిరామ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి 10వేల మందిలో ఎకరు ఎస్ఎంఏతో జన్మిస్తారని, ప్రపంచంలో ఖరీదైన జోల్ జెన్ స్మా(zolgensma) మందు ఒక్కటే నివారణ అని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కోట్ల ఖరీదు చేసే ఇంజక్షన్ అయినందున సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమకు ఆ ఇంజక్షన్ కొనుగోలు చేసే ఆర్థికస్థోమత లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం తరపున వైద్యసాయం అందించి తమ చిన్నారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడినైన తనను వైసీపీ ప్రభుత్వ హయాంలో లేటి సుధీర్, గంధం ప్రసన్నాంజనేయులు, వైసీపీ కౌన్సిలర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, తన ఇంటిని కూల్చడంతో పాటు తన 2.50 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం, తిమ్మసముద్రానికి చెందిన తోటకూర వెంకట సురేష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వ్యవసాయ భూమికి పట్టా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- పల్నాడు జిల్లాలోని బిషప్స్, పాస్టర్స్, క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పాస్టర్స్ అందరికీ ప్రభుత్వం నుంచి మ్యారేజీ లైసెన్స్ లు మంజూరుచేయడంతో పాటు పల్నాడు జిల్లాలోని అర్హులైన దైవ సేవకులకు ప్రతి నెల రూ.5వేలు గౌరవ వేతనం మంజూరుచేయాలని కోరారు. చర్చి స్థలాలకు ధృవీకరణ పత్రం, చర్చిల నిర్మాణం, మరమ్మతులకు నిధులు కేటాయించాలన్నారు. క్రిష్టియన్ కమ్యూనిటీ హాల్స్ ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
- ఇంజనీరింగ్ చదివిన తనకు అర్హతకు తగిన ఉద్యోగ అవకాశం కల్పించాలని విజయవాడ విద్యాధరపురానికి చెందిన బి.చంద్రలేఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- సాక్షర భారత్(వయోజన విద్య) కార్యక్రమంలో సుమారు 9 ఏళ్ల నుంచి పనిచేసి నిరక్షరాస్యత నిర్మూలనతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని గ్రామాల అభివృద్ధికి కారణమైన సుమారు 1840 మంది గ్రామ సమన్వయకర్తలకు న్యాయం చేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లా సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తల యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.