Vijay Government: వధువులకు 8 గ్రాముల బంగారం.. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు: విజయ్ సర్కార్ తొలి బడ్జెట్‌లో కీలక ప్రకటనలు
విజయ్ సర్కార్ తొలి బడ్జెట్‌లో కీలక ప్రకటనలు
Vijay Government: తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన తొలి బడ్జెట్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ దీనిని సభ ముందుంచారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాలపై విజయ్ సర్కార్ ఈ బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి సారించింది.
ఎన్నికల హామీల్లో భాగమైన ‘అన్నన్ సీర్ తిట్టమ్’ను టీవీకే ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. దీని కింద వధువుకు 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీరను అందిస్తారు. ఈ పథకం కోసం రూ.812 కోట్లు కేటాయించారు.
2031 నాటికి ఐదు లక్షల మందికి కృత్రిమ మేధలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులకు ఈ శిక్షణ అందనుంది. వెట్రిథిరన్ ట్రైనింగ్ స్కీమ్ కింద దశలవారీగా లక్ష మంది ఉద్యోగార్థులు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందనున్నారు.
రూ.2 వేల కోట్లతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించేందుకు వెట్రి ల్యాప్‌టాప్ స్కీమ్‌ను బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ కోసం ఈ ఏడాదికి రూ.300 కోట్లు కేటాయించారు.
‘పుతియా పయనం-పుతియా వేగం’ పథకం కింద 11వ తరగతి చదివే 5.3 లక్షల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించనున్నారు. వాటితో పాటు హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు కూడా ఇవ్వనున్నారు.
కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ.2,500, ఏడాదికి ఉచితంగా 6 వంటగ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, మహిళలకు అన్ని ప్రభుత్వ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం వంటి ఎన్నికల హామీలపై మాత్రం బడ్జెట్‌లో ప్రకటన రాలేదు.