Ajit Doval : ట్రంప్ హెచ్చరికల నడుమ రష్యాకు అజిత్ దోవల్
రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ అంశాలపై చర్చించనున్న దోవల్;
టారిఫ్‌లు వంద శాతం పెంచుతానని, పెనాల్టీలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలను భారత్ అస్సలు పట్టించుకోవడం లేదు. రష్యాతో ఎటువంటి వాణిజ్య సంబందాలు కొనసాగించినా, ముఖ్యంగా రష్యా నంచి చమురు కొనుగోలు చేసినా భారత్‌పై తీవ్రమైన సుంకాలు విధిస్తానని ట్రంప్ సమయం సందర్భం లేకుండా హెచ్చిరికగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ట్రంప్‌ను భారత్ అస్సలు పట్టించుకోవడం లేదు. ట్రంప్ అసంబద్ధ వ్యాఖ్యలను భారత్ సీరియస్‌గా తీసుకోకపోవడం అటుంచి రష్యాతో మరింత పటిష్టమైన సంబంధాలు స్ధిరపరచుకోవడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రష్యాకు పంపింది. అజిత్ దోవల్ రష్యా పర్యటన ఎప్పుడో ఖరారయ్యింది. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఇప్పుడు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లడం అత్యంత కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అజిత్ దోవల్ రష్యా పర్యటనలో ఆ దేశంతో వ్యూహాత్మక ఒప్పందాలతో పాటు రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలను చేసుకోనున్నట్లు రష్యన్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇదే సమయంలో రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఆ దేశ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్‌లు భేటీ అయి రక్షణ రంగంలో ద్వైపాక్షిక పరస్పర సహకారంపై చర్చించారు. భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టవంతం అయ్యేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆగస్టు నెలాఖరుకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా మాస్కోను సందర్శించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. మొత్తం మీద ట్రంప్ బెదిరింపులకు లొంగక రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలని భారత్ ధృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఈ చర్యలను బట్టి అర్ధమవుతోంది.