Amit Shah Releases ‘Chargesheet’: బెంగాల్‌లో టీఎంసీ పాలనపై అమిత్ షా ‘ఛార్జ్‌షీట్‌’ విడుదల

అమిత్ షా ‘ఛార్జ్‌షీట్‌’ విడుదల

Update: 2026-03-28 11:14 GMT

Amit Shah Releases ‘Chargesheet’: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం కోల్‌కతాలో టీఎంసీ ప్రభుత్వంపై ‘ఛార్జ్‌షీట్‌’ (అభియోగనామ) విడుదల చేశారు. 15 ఏళ్ల టీఎంసీ దుష్పరిపాలన, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, శాంతి-భద్రతల క్షీణతను ఈ ఛార్జ్‌షీట్‌లో వివరంగా ఎత్తిచూపారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, “బెంగాల్‌లో టీఎంసీ పాలనలో అవినీతి, భయం, అబద్ధాలు నెలకొన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా సిలిగుడి కారిడార్ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడింది” అని ఆరోపించారు. గతంలో అస్సాంలో చొరబాటుదారులు సులభంగా ప్రవేశించేవారని, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొరబాట్లు పూర్తిగా ఆగిపోయాయని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోకి చొరబాట్లు జరుగుతున్న jedi ఏకైక మార్గం బెంగాల్‌ మాత్రమేనని, ఇది దేశ భద్రతకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

కోర్టు ఆదేశాలు ఉన్నా బీఎస్‌ఎఫ్‌ సరిహద్దు కంచె నిర్మాణం కోసం టీఎంసీ ప్రభుత్వం భూమి కేటాయించలేదని షా ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు, అధికారులు అక్రమ వలసలను అడ్డుకోకపోవడం వల్ల నకిలీ పత్రాలతో చొరబాటుదారులు బెంగాల్‌ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తున్నారని తెలిపారు. ఈ చొరబాటుదారుల ఓట్ల కోసం మమతా బెనర్జీ ‘సర్’ ప్రక్రియపై, ఎన్నికల కమిషన్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చొరబాట్లను పూర్తిగా అరికట్టి, సరిహద్దులో కంచె వేసి దేశ భద్రతను కాపాడతామని అమిత్ షా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ఛార్జ్‌షీట్‌ను బెంగాల్‌ ప్రజల తరపున బీజేపీ వేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నాయకులు సువెందు అధికారి, సామిక్ భట్టాచార్యలు పాల్గొన్నారు. బెంగాల్‌ ఎన్నికలు దేశ భద్రతకు కీలకమని షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags:    

Similar News