BJP National President Election: భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం: నితిన్‌ నబీన్‌కు పట్టాభిషేకం ఖాయం

నితిన్‌ నబీన్‌కు పట్టాభిషేకం ఖాయం

Update: 2026-01-17 13:46 GMT

BJP National President Election: భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ అధ్యక్షుడిగా బిహార్‌కు చెందిన నాయకుడు నితిన్‌ నబీన్‌ను నియమించేందుకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఎంపీ కె.లక్ష్మణ్‌ శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం, జనవరి 19న నామినేషన్లు స్వీకరణ, 20న అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, డిసెంబర్‌ 14న నితిన్‌ నబీన్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన పార్టీ నాయకత్వం, ఇప్పుడు అధికారిక ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు సిద్ధమైంది. ఇది పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో చివరి దశగా భావిస్తున్నారు.

పార్టీలో ఇప్పటికే 14 కోట్ల మంది సాధారణ సభ్యులు, 12 లక్షల మంది క్రియాశీల సభ్యుల నమోదు పూర్తయింది. 30 రాష్ట్రాల్లో బూత్‌, మండల, జిల్లా స్థాయి కమిటీలతో సహా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమమైంది. 19వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 4 నుంచి 5 గంటల వరకు పరిశీలన, 5 నుంచి 6 గంటల వరకు ఉపసంహరణలు జరుగుతాయి. సాయంత్రం 6.30 గంటలకు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిని కనీసం ఐదు రాష్ట్రాల నుంచి 20 మంది చొప్పున రాష్ట్ర, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు ప్రతిపాదించాలి.

20వ తేదీన జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో అధ్యక్ష ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత జరిగే కౌన్సిల్‌ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నారు. ఈ ఎన్నికలతో భాజపా తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News