జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ మొత్తంలో కాలిపోయిన కరెన్సీ నోట్లు బయటపడిన ఘటన వాస్తవమేనని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన 60 పేజీల నివేదికలో ఈ వివరాలు చేర్చారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో వర్మ నివాసంలో కాలిపోయిన కరెన్సీ నోట్లు ఈ ఏడాది మార్చిలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయినా, ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అయితే, తాజా నివేదిక నేపథ్యంలో ఆయనను విధుల నుంచి పూర్తిగా తప్పించాలని కమిటీ బలంగా సిఫార్సు చేసినట్లు సమాచారం.



మార్చి 14వ తేదీన ఢిల్లీ తుగ్లక్ క్రెసెంట్ రోడ్డులోని వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌రూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో వేల సంఖ్యలో రూ.500 నోట్ల కట్టలు కాలిపోయినట్లు గుర్తించారు. కమిటీ అందించిన వివరాల ప్రకారం, ఆ స్టోర్‌రూమ్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష, పరోక్ష నియంత్రణలోనే ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయని పేర్కొంది. ఘటన జరిగిన మరుసటి రోజు తెల్లవారు జామున దగ్ధమైన నగదును అక్కడి నుంచి తొలగించిన ఘటన ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చిందని పేర్కొంది. నివాసంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఉండటం అనుమానాస్పదమని కమిటీ అభిప్రాయపడింది.



పది రోజులపాటు సాగిన విచారణలో 55 మంది సాక్షుల వాంగ్మూలాలను కమిటీ రికార్డు చేసింది. ఓ కీలక సాక్షి "నేలపై రూ.500 నోట్ల భారీ కట్టలు పడివున్నాయి. నా జీవితంలో ఇంత డబ్బు చూడలేదు" అని చెప్పినట్లు సమాచారం. జస్టిస్ వర్మ కుమార్తెతో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజేందర్ సింగ్‌ను కూడా విచారించామని కమిటీ వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన నోట్ల వివరాలను నమోదు చేయకుండా రాజేందర్ సింగ్ అడ్డుకున్నారని ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి.



ఈ సంచలన అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం మార్చి 28న జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు ఇవ్వలేదు. ఇప్పుడు కమిటీ నివేదికతో ఈ వ్యవహారం మళ్లీ జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.




Tags: