Justice Yashwant Verma: నోట్ల కట్టల వివాదం ముగింపు: జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

Update: 2026-04-10 15:50 GMT

Justice Yashwant Verma: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. దిల్లీలోని తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో అభిశంసన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు ప్రారంభించిన అభిశంసన ప్రక్రియ సహజంగా ముగిసిపోయిందని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి.

గతంలో దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని నియమించి అంతర్గత విచారణ చేయించారు. కమిటీ నోట్ల కట్టలు దొరికిన విషయం వాస్తవమని నిర్ధారించింది.

దీంతో సీజేఐ జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని సూచించగా, ఆయన ఆ సూచనను తిరస్కరించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన, తాను గానీ తన కుటుంబం గానీ ఇంటి స్టోర్ రూమ్‌లో ఎప్పుడూ నగదు దాచలేదని, ఆ గదికి ఎవరైనా వెళ్లవచ్చని వాదించారు. విచారణ కమిటీ నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖలు రాసి జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని అభిశంసనకు సిఫారసు చేశారు. దీంతో పార్లమెంటు రెండు సభల్లోనూ ఎంపీలు అభిశంసన తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేసి, అభిశంసన ప్రక్రియ నుంచి తప్పించుకున్నారు.

Tags:    

Similar News