Samosa Jilebi : సమోసా, జిలేబీలపై సిగరెట్‌ తరహా హెచ్చరికలు

ఈ పదార్ధాలపై ఆరోగ్య హెచ్చరికలు చేయాలంటున్న కేంద్రం;

Update: 2025-07-15 05:03 GMT

మనకేమో సమోసా, జిలేబీలను చూస్తే ఓ పట్టాన వదలబుద్దేయ్యదు. కడుపు ఖాళీ లేకున్నా ఓ పట్టుపట్టాలనిపిస్తుంది. జిహ్వ చాపల్యమంటే అదే మరి! స్నాక్స్‌లో సమోసా కామనైపోయింది. ఇక నార్త్‌ ఇండియా వాళ్లకేమో జిలేబీ లేనిదే పొద్దు కుంకదు. ఇప్పుడీ ఉపోద్ఘాతమెందుకంటే ఇకమీదట ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి హానీకరం కాబోతున్నాయి. సిగరెట్‌ పెట్టల మీద పొగతాగడం ఆరోగ్యానికి హానీకరమని, ప్రాణాంతకం అని రాస్తారు కదా.. ! అలాగే ఈ తిండి పదార్థాలపై ఆరోగ్య హెచ్చరికలు చేయబోతున్నారట! ఇవే కాదు కచోరి, పిజ్జా, బర్గర్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, గులాబ్‌ జామూన్‌, వడాపావ్‌, ఇలాంటి వాటిల్లో నూనె పరిమాణాన్ని సూచిస్తూ బోర్డులు పెట్టాలని అన్ని మంత్రిత్వ శాఖలను, విభాగాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. అంటే ఇక మీదట స్నాక్స్‌లో ఆయిల్‌, షుగర్‌, సాల్ట్‌ ఏ మేరకు ఉన్నాయో తప్పనిసరిగా చెప్పాలన్నమాట! చెప్పకపోతే నేరమవుతుంది. ఆహార పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయమిది. ఇలాంటి ఆహార పదార్థాల కారణంగా ఊబకాయం, మధుమేహం, బీపీ, గుండె జబ్బులు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ స్నాక్స్‌పై నిషేధం విధించే అవకాశం లేదని, ఇది కేవలం ఆరోగ్యపరమైన అవగాహన కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:    

Similar News