Aadava Arjuna: తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసఫ్ విజయ్ ప్రతిరోజూ దాదాపు 18 నుంచి 20 గంటలు పని చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆధవ అర్జున వెల్లడించారు. చెన్నైలో జరిగిన ‘ఇండియా టుడే తమిళనాడు కాంక్లేవ్’లో ఆయన మాట్లాడుతూ సీఎం విజయ్ పని తీరు, పరిపాలనా శైలి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“మా సీఎం రోజుకు 18 నుంచి 20 గంటలకు పైగా పని చేస్తున్నారు. ఉదయం 4 గంటలకే మంత్రులకు ఫోన్ చేసి ప్రతి శాఖలో ఏం జరుగుతోందో అడుగుతారు. ఇలాంటి సీఎం మాకు ఉన్నారు” అని ఆధవ అర్జున అన్నారు. విజయ్ ఉదయం 4 గంటలకే తన దినచర్యను ప్రారంభించి, మంత్రులతో సంబంధిత శాఖల సమస్యలు, ఆ రోజు చేపట్టాల్సిన పనుల గురించి చర్చిస్తారని తెలిపారు.

ఎన్నికల్లో గెలుపు తర్వాత ఎటువంటి సంబరాలు చేసుకోకుండా రాష్ట్రం కోసం పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. “ఎన్నికల్లో గెలిచాను కదా అని మా సీఎం విశ్రాంతి తీసుకోవట్లేదు. ప్రభుత్వానికి ఉన్న సవాళ్లను గుర్తించడానికి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల ఇబ్బందులు, మంత్రిత్వ శాఖల సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించారు. ప్రజల కోసం మాత్రమే పని చేయాలని మాకు సూచించారు. ఎప్పుడు చూసినా ఏం చేయాలి? ఎలా చేయాలి? దీని తర్వాత ఇంకేం చేయాలి? ఇంకా ఎంత మెరుగ్గా చేయగలం? అనే ఆలోచనల్లోనే ఉంటారు” అని అర్జున వివరించారు.

సీఎం విజయ్‌ను ‘రాజకీయ సన్యాసి’గా అభివర్ణిస్తూ, ఆయన ఆర్థిక వనరుల దుర్వినియోగాన్ని అరికట్టాలని, ప్రభుత్వ ప్రక్రియల్లో పారదర్శకత పాటించాలని తరచూ చెబుతుంటారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అతి ముఖ్యమైన సమస్య అవినీతి అని సీఎం బలంగా నమ్ముతున్నారని, అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ఆర్థిక లీకేజీలు అరికట్టడం, పారదర్శకత పెంచడం వంటి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కింది స్థాయిలో ఇంకా అవినీతి ఉందని, దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ సమస్యను త్వరలోనే పూర్తిగా నివారిస్తామని ఆధవ అర్జున స్పష్టం చేశారు.

విజయ్ 2026 మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పని తీరు గురించి మంత్రి ఇచ్చిన వివరాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags: